- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Gold from E-Waste: ఇది మీకు తెలుసా? చెత్త నుంచి బంగారం తీస్తున్నారట!

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ యుగం (Electronic age) నడుస్తోంది. రోజు రోజుకూ విద్యుత్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా ఈ-వ్యర్థాలు (E Waste) కూడా భారీగా పెరుకుపోతున్నాయి. ఏటా 62 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇందులో కేవలం 20 శాతం మాత్రమే రీసైకిల్ (Recycle) అవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా శాస్త్రవేత్తలు ఓ అద్భుత విధానాన్ని అభివృద్ధి చేశారు. అదే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికితీయటం. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా బంగారం, వెండి (Gold, Silver) వంటి లోహాలను భూమి పొరల నుంచి మాత్రమే లభిస్తాయి. మరీ ఈ-వేస్ట్ నుంచి ఎలా బంగారం లభిస్తుందనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే, బంగారాన్ని ఎలక్ట్రానిక్ సాధనాల్లోని సర్క్యూట్లు, మెమరీ చిప్‌లలో కనెక్టర్లుగా (Circuits, as connectors in memory chips) వాడుతుంటారు. ఈ లోహానికి తుప్పు పట్టదు. విద్యుత్ వాహకత కూడా ఎక్కువే. నికెల్, కొబాల్ట్ (Nickel, Cobalt) వంటి లోహాలతో కలిపి దీన్ని వినియోగిస్తే మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని బంగారంలో 7 శాతం వరకు ఈ-వేస్ట్‌లో ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకే వీటి నుంచి బంగారాన్ని వెలికితీసే టెక్నాలజీని డెవలప్ చేసినట్లు చెబుతున్నారు.
సంప్రదాయ విధానాల్లో ఈ-వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికితీస్తే.. శక్తిమంతమైన రసాయనాలను ఉపయోగించాల్సి వస్తోంది. ఇందులో సైనైడ్ వాడకం కూడా ఉంటుంది. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో హానికర రసాయనాల వాడకం ఉండదు. ఈ ప్రక్రియ కోసం వారు వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (VCOF)లను రూపొందించారు. ఇవి రంధ్రాలతో కూడిన స్ఫటిక పదార్థాలు. టెట్రాథయాఫుల్వలీన్ (TTF), టెట్రాఫినైల్ ఇథలీన్ (TPE)లను ఉపయోగించి రెండు రకాల VCOFలను శాస్త్రవేత్తలు తయారుచేశారు.
TTFతో తయారైన VCOFకు బంగారాన్ని 99.99 శాతం మేర ఒడిసిపట్టే సామర్థ్యం ఉన్నట్లు తేలింది. అందులో సల్ఫర్ పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. అంతేకాదు, బంగారం.. సల్ఫర్‌కు సహజసిద్ధంగా ఆకర్షితమవుతుంది. అదే సమయంలో నికెల్, రాగి వంటి ఇతర లోహాలను TTF చాలా స్వల్పంగానే ఆకర్షిస్తోంది. అంతేకాదు, ఈ ప్రాసెస్ లో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్‌ను కార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్రయోజనకర సేంద్రీయ పదార్థాలుగా మారుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఈ-వ్యర్థాల బెడదతో పాటు ఇటు పర్యావరణ సమస్యకు విరుగుడు లభిస్తుందని అంటున్నారు.