చంద్రబాబు​ పిలుపు.. చిత్తూరు జిల్లాలో టెన్షన్.. టెన్షన్!

by Anukaran |   ( Updated:2021-03-01 00:28:52.0  )
చంద్రబాబు​ పిలుపు.. చిత్తూరు జిల్లాలో టెన్షన్.. టెన్షన్!
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు చిత్తూరు, తిరుపతిలో నిరసన దీక్షలకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. ఆదివారం జిల్లాలోని చౌడేపల్లి మండల టీడీపీ నేత రమేష్​రెడ్డిపై నాన్​బెయిలబుల్​కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. తిరుపతిలో 43వ డివిజన్​కార్పొరేటర్‌గా టీడీపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి లక్ష్మీదేవి టీ దుకాణాన్ని మున్సిపల్​సిబ్బంది తొలగించారు. ఇవన్నీ అధికార పార్టీ నేతలు కావాలనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం చిత్తూరు, సాయంత్రం తిరుపతి బస్టాండు సమీపంలో నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చారు. వేల మందిని సమీకరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసు యాక్ట్​30 అమల్లో ఉన్నందున వేల మంది ఒక చోట గుమిగూడేందుకు అనుమతించేది లేదని ప్రకటించారు. దీనికితోడు 144 సెక్షన్​ విధించారు.

తిరుపతిలో తిరుమల వెళ్లే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని, సంఘ విద్రోహశక్తులు నిరసన కార్యక్రమంలో పాల్గొనే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్​మార్గదర్శకాలతోపాటు ఎన్నికల కోడ్​అమల్లో ఉన్నందున చంద్రబాబు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని తేల్చారు. మరోవైపు ఆ పార్టీ నేతలు పులివర్తి నాని, నరసింహయాదవ్, ఎమ్మెల్సీ దొరబాబుతోపాటు కీలక నేతలను వారి నివాసాల్లోనే నిర్బంధించారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా నిరసన చేపడతామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేత పర్యటించే హక్కు లేదా !

రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటించే హక్కు లేదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో హౌస్​అరెస్టు చేసిన టీడీపీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​చేశారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం సరికాదని తెలిపారు. వేల మందితో కుల సంఘాలు, ర్యాలీలు, సభలకు అనుమతినిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ర్టంలో సాగుతున్న అరాచక పాలనకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత

Advertisement

Next Story

Most Viewed