నవరత్నాల పేరుతో ప్రజలకు నవనామాలు పెట్టారు : టీడీపీ ఎమ్మెల్యే

by srinivas |
నవరత్నాల పేరుతో ప్రజలకు నవనామాలు పెట్టారు : టీడీపీ ఎమ్మెల్యే
X

దిశ, ఏపీ బ్యూరో: మాట తప్పడం, మడమ తిప్పటం, నమ్మించి మోసం చేయటం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నైజమని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. ఆదివారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాదయాత్రలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఫించన్ దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు జగన్ అన్నింటా మాటతప్పారన్నారు. ఫించన్ రూ. 3 వేలకు పెంచుతామని కేవలం రూ. 250 మాత్రమే పెంచారన్నారు. 2021 జూలై 8న వైఎస్ఆర్ పుట్టిన రోజున పింఛన్ రూ.2,250 నుంచి రూ. 2,500 కు పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారని కానీ ఆగస్టు నెల పింఛన్ కూడా పెంచకుండా రూ. 2,250 మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు.

“జగన్ మమ్మిల్ని మోసం చేశారని వృద్ధులు, వితంతవులు, వికలాంగులు వాపోతున్నారన్నారు. వారిని మోసం చేయటానికి జగన్ రెడ్డికి మనసెలా వచ్చింది? ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు 45 ఏళ్లకే ఫించన్ ఇస్తామని అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. హామీలు అమలు చేయటం చేతకానప్పుడు హామీలివ్వటం ఎందుకు ? ప్రజలను మోసం చేయటం ఎందుకు? ఏ ఆధారం లేకుండా జీవిస్తున్న వృద్దులను, వితంతవులు, వికలాంగులను మోసం చేయటం సరికాదు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు నెల నుంచే పింఛన్ రూ.2,500కు పెంచాలి” అని డిమాండ్ చేశారు. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని టీడీపీకి ఓట్లేయని వారికి ఫించన్లు, సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. మీ ప్రతాపం వృద్ధులపై చూపించడం సరికాదన్నారు. మీ చేతకాని పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని.. సరైన సమయంలో తగిన విధంగా బుద్ధిచెబుతారని బాలవీరాంజనేయస్వామి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed