ఇప్పుడు అరెస్టు చెయ్యగలరా?.. ఇది స్కాం కాదా?

by srinivas |
ఇప్పుడు అరెస్టు చెయ్యగలరా?.. ఇది స్కాం కాదా?
X

దిశ, ఏపీ బ్యూరో: ‘‘మీ పార్టీ ముఖ్యనేత, మీ ఆత్మబంధువు విజయసాయిరెడ్డి 108 అంబులెన్స్‌ల నిర్వహణ స్కాంలో వందల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు, ఇప్పుడు పోలీసులతో గోడలు దూకించి అరెస్ట్ చేయించగలరా’’ అంటూ టీడీపీ నేత పట్టాభిరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయసాయి రెడ్డిని అరెస్టు చేసే ధైర్యం మీకు ఉందా? అంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక 108 అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్టు ముగియడంతో, 2016లో అత్యంత పారదర్శకంగా టెండర్లు పిలిచి బీవీజీ సంస్థకు టెండర్లు అప్పగించినట్టు వెల్లడించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏమాత్రం అనుభవంలేని అరబిందో ఫౌండేషన్‌కు అంబులెన్స్‌ల నిర్వహణ అప్పగించారని ఆరోపించారు. అనేక రాష్ట్రాలతోపాటు, దేశ రాజధానిలోనూ అంబులెన్స్‌లు నిర్వహిస్తున్న బీవీజీ సంస్థను పక్కనబెట్టేశారని మండిపడ్డారు.

అనుభవంలేని అరబిందో ఫౌండేషన్‌ను తీసుకువచ్చి కొత్త అంబులెన్స్‌కు అయితే నెలకు రూ.1,78,072, పాత అంబులెన్స్ అయితే నెలకు రూ.2,21,257 రేట్ల చొప్పున కట్టబెట్టారని ఆరోపించారు. గతంలో బీవీజీ సంస్థ ఎంతో తక్కువ నిర్వహణ వ్యయంతో 108 అంబులెన్స్‌లు చేపట్టినట్టు వివరించారు. దీంతో అరబిందో ఫౌండేషన్ ఎక్కడదని ఆరా తీస్తే, వైఎస్ జగన్ ఆత్మబంధువుగా పేర్కొన్న విజయసాయిరెడ్డికి స్వయానా వియ్యంకుడు పీవీ రాంప్రసాద్ రెడ్డికి చెందినదని తెలిసింది. ‘‘నీ వియ్యంకుడు, నీ అల్లుడు రోహిత్ చెందిన సంస్థకు ఇంకా దోచిపెడుతున్నావా.. పెళ్లి చేసి ఆరేడు సంవత్సరాలు అవుతున్నా, ఇంకా ఈ విధంగా కట్నకానుకలు పంపవుతున్నావా.. సిగ్గుపడాలి విజయసాయిరెడ్డీ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావా?’’ అంటూ పట్టాభి మండిపడ్డారు.

Advertisement

Next Story