మెరుగ్గా టీసీఎస్ ఆదాయం

by Harish |
మెరుగ్గా టీసీఎస్ ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. కొవిడ్-19 ప్రభావం కారణంగా కంపెనీ నికర లాభం 7.05 శాతం తగ్గి రూ. 7,475 కోట్లకు క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 8,042 కోట్లను నమోదు చేసింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.9 శాతం పెరిగి రూ.8,433 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

విశ్లేషకుల అంచనా ప్రకారం..స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయంలో వరుస వృద్ధిని టీసీఎస్ కంపెనీ నివేదించింది. అలాగే, నిర్వహణ మార్జిన్లు 26.2 శాతంగా ఉన్నాయి. కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిండెండ్ ప్రకటించింది. కస్టమర్లు తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు, పునరుద్ధరణకు సాంకేతికతపై ఖర్చులను పెట్టడం వల్ల రెండో త్రైమాసికంలో టీసీఎస్ సంస్థ సుమారు రూ. 62 వేల కోట్ల విలువైన ఒప్పందాలను గెలుచుకున్నట్టు వెల్లడించింది.

అదేవిధంగా, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 4.53 లక్షల మంది ఉద్యోగులకు జీతం పెంపును కంపెనీ విడుదల చేసింది. ఇక, సెప్టెంబర్ నుంచి మొదలైన మూడో త్రైమాసికంలో టీసీఎస్ సంస్థ 9,864 మందిని నియమించింది. ‘తమ వినియోగదారులు డిజిటల్ పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తించడంతో ఆదాయ వృద్ధి ఏర్పడింది. పటిష్ఠమైన్ ఆర్డర్లు, బలమైన ఒప్పందాలు, నిరంతర మార్కెట్ వాటాలతో భవిష్యత్తుపై తమకు విశ్వాసం ఉందని’ టీసీఎస్ రాజేశ్ గోపీనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు.

రూ. 16 వేల కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం…

బుధవారం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 16 వేల కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్ల బైబ్యాక్‌ను చేస్తున్న తొలి సంస్థ టీసీఎస్ కావడం గమనార్హం. ఇంతకుముందు టీసీఎస్ 2018లో షేర్ల బైబ్యాక్ చేసింది. 53.3 లక్షల షేర్లను రూ. 3 వేల వద్ద కొనుగోలు చేయనుంది. క్లోజింగ్ ధరతో పోలిస్తే 9.59 శాతం ప్రీమియం ఆఫర్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Advertisement

Next Story