ఫ్లాష్ ఫ్లాష్ : నడిరోడ్డుపై తగలబడిన ఆర్టీసీ బస్సు

by Sumithra |   ( Updated:2023-12-15 17:24:37.0  )
rtc-bus
X

దిశ, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మండ‌ల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై తెలంగాణ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు (TS 28 ఎస్‌టీ జెడ్ 5403)కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించడంతో జనాలు చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ బస్సు హనుమకొండ నుంచి హైదారాబాద్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ ప్రయాణీకులను అప్రమత్తం చేయగా పెను ప్రమాదం తప్పింది.

ఆ టైంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలియడంతో స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు రమేష్, అనితలు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. బస్టాండుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉన్న దుకాణా సముదాయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. ఫైర్ డిపార్ట్ మెంటుకు సమాచారం అందించగా వారు ఆలస్యంగా స్పందించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story