సొంత డిజిటల్ సేవల వ్యవస్థలోకి ఎస్‌బీఐ

by Shyam |
సొంత డిజిటల్ సేవల వ్యవస్థలోకి ఎస్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అత్యంత పోటీగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోకి ప్రవేశించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భావిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), భారతీయ బ్యాంకుల సమాఖ్య ఉమ్మడిగా నెలకొల్పిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు ప్రత్యర్థిగా మారేందుకు ఎస్‌బీఐ (SBI) సిద్ధమైంది. రిటైల్ చెల్లింపుల అంశంలో బ్యాంకులకు ఎన్‌పీసీఐ (NPCI) వల్ల ప్రయోజనం లేదని భావించిన ఎస్‌బీఐ దీనికి ప్రత్యామ్నాయంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.

ఇప్పటివరకూ దేశంలో ఎస్‌బీఐతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు (Public and private sector banks)లకు రిటైల్ చెల్లింపుల సేవలను ఎన్‌పీసీఐ (NPCI) అందిస్తోంది. మొత్తం 60 శాతం లావాదేవీలు ఎన్‌పీసీఐ నియంత్రణలో ఉన్నాయి. వీటిలో యూపీఐ, తక్షణ చెల్లింపు సేవలు (IMPS), భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) లాంటి సేవలు కూడా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న కారణంగా ఈ విభాగంలోకి ఎస్‌బీఐ నేరుగా ప్రవేశించడానికి సిద్ధమవ్వాలని చూస్తోంది.

తద్వారా నిష్ప్రయోజనంగా ఉన్న ఎన్‌పీసీఐని చెక్ పెట్టడానికి వీలవుతుందని భావిస్తోంది. దీనికోసం రూ. 500 కోట్ల పెట్టుబడులతో సంస్థను ప్రారంభించాలని, ఈ క్రమంలోనే ఆర్‌బీఐ (RBI)కి కూడా దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, కొత్త డిజిటల్ పేమెంట్ సంస్థలో భాగస్వామ్యం అవ్వాలంటూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ ప్రధాన ప్రమోటర్‌గా ఉంటూనే మిగిలిన వారితో కన్సార్టియం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపుతోంది. ఈ దరఖాస్తుల కోసం 2021, జనవరి వరకు గడువు ఉంది. ఆ సమయంలోపు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది.

Advertisement

Next Story