సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్ జోడీకి షాక్

by Harish |
సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్ జోడీకి షాక్
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు తొలి రోజు దారుణంగా నిరాశపరిచారు. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నం.1 జంట సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం గమనార్హం. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జోడీకి డెన్మార్క్‌కు చెందిన డేనియల్ లండ్‌గార్డ్-మ్యాడ్స్ వెస్టర్‌గాడ్ జంట షాకిచ్చింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21 తేడాతో డెన్మార్క్ జంట చేతిలో పరాజయం పాలైంది.

47 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జంట వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయింది. ఇదే నెలలో సాత్విక్ జోడీ థాయిలాండ్ ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే. ఉమెన్స్ డబుల్స్‌లో రుతుపర్ణ-శ్వేతపర్ణ, మిక్స్‌డ్ డబుల్స్‌లో అశిత్ సూర్య-అమృత జంటలు కూడా తొలి రౌండ్‌లోనే తమ పోరాటాన్ని ముగించాయి. సింగిల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. మెన్స్ సింగిల్స్‌లో ప్రియాన్ష్ రజావత్, ఆకర్షి కశ్యప్ మొదటి రౌండ్‌ను దాటలేకపోయారు. లీ చెయుక్ యియు(హాంకాంగ్) చేతిలో 23-21, 21-19 తేడాతో ప్రియాన్జు, చోకీవాంగ్(థాయిలాండ్) 21-19, 22-20 తేడాతో ఆకర్షి పోరాడి ఓడిపోయారు. బుధవారం తొలి రౌండ్‌లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు.

Advertisement

Next Story