టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కు షాక్.. ఫైనల్‌లో సౌతాఫ్రికా

by Harish |
టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌కు షాక్.. ఫైనల్‌లో సౌతాఫ్రికా
X

కేప్‌టౌన్: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ కప్ చరిత్రలోనే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. శుక్రవారం ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరిగిన సెమీస్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గి సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 164/4 స్కోరు చేసింది. ఓపెనర్లు వోల్వార్డ్ట్(53), తజ్మిన్ బ్రిట్స్(68) అర్ధ సెంచరీలతో చెలరేగి తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో సౌతాఫ్రికాకు శుభారంభం దక్కింది.

వోల్వార్డ్ట్ అవుటైనా తజ్మిన్ బ్రిట్స్.. మారిజాన్ కాప్(27 బ్యాటింగ్)తో కలిసి విలువైన 46 పరుగులను జత చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా స్వల్ప వ్యవధిలోనే తజ్మిన్ బ్రిట్స్ వికెట్‌తోపాటు ట్రయాన్(3), నాడిన్ డి క్లర్క్(0) వికెట్లను నష్టపోయింది. చివరి ఓవర్‌లో మారిజాన్ కాప్ మూడు ఫోర్లు బాదడంతో సౌతాఫ్రికాకు మంచి స్కోరు దక్కింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఎక్లోస్టోన్ 3 వికెట్లతో రాణించగా.. లారెన్ బెల్‌కు ఒక వికెట్ దక్కింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 158 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినప్పటికీ ప్రత్యర్థి విజయావకాశాలను బౌలర్లు ఆయబొంగ ఖాకా, షబ్నిమ్ ఇస్మాయిల్ దెబ్బకొట్టారు.

డేనియల్ వ్యాట్(34), సోఫియా డంక్లీ(28), నాట్ స్కివర్ బ్రంట్(40), హీథర్ నైట్(31) పోరాడినప్పటికీ కీలక సమయాల్లో వికెట్ పారేసుకున్నారు. ఒకదశలో 24 బంతుల్లో 33 పరుగులతో ఇంగ్లాండ్‌కే విజయావకాశాలు ఉన్నాయి. కానీ, బౌలర్ ఆయబొంగ ఖాకా ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఒకే ఓవర్‌లో అమీ జోన్స్, సోఫియా ఎక్లోస్టోన్‌, కేథరీన్ స్కివర్-బ్రంట్‌లను అవుట్ చేసింది. పోరాడిన హీథర్ నైట్‌ను చివరి ఓవర్‌లో షబ్నిమ్ ఇస్మాయిల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఆయబొంగ ఖాకా 4 వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్ 3 వికెట్లతో సత్తాచాటారు. ఈ నెల 26న జరిగే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య టైటిల్ పోరు జరగనుంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed