PKL Auction : తొలి రోజు ముగిసిన పీకేఎల్ వేలం.. భారీ ధర పలికింది ఎవరో తెలుసా?

by Harish |
PKL Auction : తొలి రోజు ముగిసిన పీకేఎల్ వేలం.. భారీ ధర పలికింది ఎవరో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ 11‌కు సంబంధించిన వేలం ముంబైలో గురువారం మొదలైంది. రెండో రోజులపాటు ఆక్షన్ జరగనుంది. తొలి రోజు 12 ఫ్రాంచైజీలు రైడర్లు, ఆల్‌రౌండర్లపై కోట్లు కుమ్మరించాయి. రాజస్థాన్‌కు చెందిన రైడర్ సచిన్ తన్వార్‌ జాక్‌పాట్ కొట్టాడు. తమిళ్ తలైవాస్ అతన్ని రూ. 2.15 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, ఇరానీ డిఫెండ‌ర్ మ‌హమ్మద్ రెజా షాద్‌లోహ్ కూడా భారీ పలికాడు. హర్యానా స్టీలర్స్ అతని కోసం రూ.2.07 కోట్లు వెచ్చించింది. రైడర్ గుమాన్ సింగ్‌ను రూ. 1.97 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ తీసుకుంది.

ఇక, ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్ తిరిగి దక్కించుకుంది. వేలానికి ముందు సెహ్రావత్‌ను రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చిన టైటాన్స్.. వేలంలో అతన్ని రూ. 1.72 కోట్లకు కొనుగోలు చేసింది. టైటాన్స్ సెహ్రావత్‌తోపాటు డిఫెండర్ కృష్ణన్(రూ. 30 లక్షలు), ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్(రూ. 20 లక్షలు) తీసుకుంది. మరో ఆల్‌రౌండర్ భరత్‌ రూ.1.30 కోట్లకు యూపీ యోధాస్ సొంతం చేసుకుంది. తొలి రోజు 8 మంది రూ. కోటికిపైగా ధర పలికారు. మనిందర్ సింగ్‌ను రూ.1.15 కోట్లకు బెంగాల్ వారియర్స్, అజింక్యా అశోక్ పవార్‌‌ను రూ.1.10 కోట్లకు బెంగళూరు బుల్స్, సునీల్ కుమార్‌ను రూ.1.01 కోట్లకు యూ ముంబా కొనుగోలు చేశాయి.

భారీ అంచనాలతో వేలంలోకి వచ్చిన స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్‌‌ రూ.కోటి లోపే పరిమితమయ్యాడు. అతన్ని రూ. 70 లక్షలకు బెంగళూరు బుల్స్ దక్కించుకుంది. పీకేఎల్‌లో బాహుబలిగా గుర్తింపు పొందిన రైడర్ సిద్ధార్థ్ దేశాయ్‌ కేవలం రూ. 26 లక్షలే పలికాడు. అతన్ని దబాంగ్ ఢిల్లీ కే.సీ తీసుకుంది. 500లకు పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా తొలి రోజు 20 మంది ప్లేయర్లను ఆయా ప్రాంచైజీ కొనుగోలు చేశాయి. శుక్రవారం కూడా వేలం కొనసాగనుంది.

Advertisement

Next Story

Most Viewed