కాస్ తీర్పుపై వినేశ్ తరపు లాయర్ ఏమన్నాడంటే?

by Harish |
కాస్ తీర్పుపై వినేశ్ తరపు లాయర్ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హతను సవాల్ చేసిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌)లో నిరాశ ఎదురైంది. జాయింట్ మెడల్ ఇవ్వాలన్న ఆమె అప్పీలను కాస్ కొట్టివేసిన విషయం తెలిసిందే. కాస్ తీర్పుకు వ్యతిరేకంగా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేయొచ్చని వినేశ్ తరపున వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్ సింఘానియా తెలిపారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వినేశ్ అప్పీలను కొట్టివేయడానికి గల కారణాన్ని కాస్ వెల్లడించలేదన్నారు.

‘ఆమె అప్పీల్‌ను కొట్టివేస్తున్నట్టు పూర్తి ఆర్డర్ ఇంకా రాలేదు. కేవలం సింగిల్ లైన్ ఆర్డర్ మాత్రమే వచ్చింది. ఎందుకు తిరస్కరించారు?.. సమయం ఎందుకు తీసుకున్నారు? అనే విషయాలపై కారణం చెప్పలేదు. కాస్ తీర్పుపై మేము ఆశ్చర్యపోయాం. నిరాశకు గురయ్యాం. 10-15 రోజుల్లో పూర్తి ఆర్డర్ వస్తుందని ఆశిస్తున్నా. పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత 30 రోజుల్లో కాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేయొచ్చు. హరీశ్ సాల్వే మాతో ఉన్నారు. ఆయన మనకు మార్గదర్శకత్వం చేస్తారు. ఆయన చర్చించి అప్పీల్‌ను సిద్ధం చేస్తాం.’ అని తెలిపారు. కాగా, 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్‌ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన పతకాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story