ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్స్ అదరగొట్టారు..

by Vinod kumar |   ( Updated:2023-02-22 14:17:15.0  )
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్స్ అదరగొట్టారు..
X

న్యూఢిల్లీ: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అదరగొట్టారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా పతనానికి కారణమైన వీరిద్దరూ ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఒక్క స్థానాన్ని అధిగమించి 864 రేటింగ్ పాయింట్లతో 2వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అండర్సన్‌ 866 రేటింగ్ పాయింట్లను కలిగి ఉండగా అశ్విన్ కేవలం 2 పాయింట్స్ మాత్రమే వెనుబడి ఉన్నారు.

మూడో టెస్టులో సత్తాచాటితే అతను టాప్ పొజిషన్‌కు చేరుకోవడం ఖాయమే. అలాగే, నాలుగేళ్లపాటు అగ్రస్థానాన్ని కాపాడుకున్న ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ నం.1 ర్యాంక్‌ను కోల్పోయి 3వ స్థానానికి పడిపోయాడు. అలాగే, రెండో టెస్టులో 10 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా 6 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 6,7 ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఇక, ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా అగ్రస్థానాన్ని 460 రేటింగ్ పాయింట్లతో మరింత పదిలం చేసుకున్నాడు. అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న అక్షర్ పటేల్ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 5వ ర్యాంక్‌లో నిలిచాడు.

Also Read..

కార్ల్‌సెన్‌కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్‌మాస్టర్..

Advertisement

Next Story