ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వాళ్లకు చాలా అడ్వాంటేజ్: ఆకాశ్ చోప్రా

by Vinod kumar |
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వాళ్లకు చాలా అడ్వాంటేజ్: ఆకాశ్ చోప్రా
X

దిశ, వెబ్‌డెస్క్: మరో మూడు రోజుల్లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2023 సీజన్ ఐపీఎల్‌ ముస్తాబవుతోంది. టీ20 మజాను అందించేందుకు 10 జట్లు సన్నద్ధమవుతుండగా.. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వైడ్‌, నోబాల్‌కు రివ్యూ, టాస్‌ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్‌లో ప్రవేశ పెట్టబోతుంది. అయితే లీగ్ ప్రారంభానికి ముందే 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రూల్ ప్రకారం మ్యాచ్‌ కోసం ప్రతి జట్టూ తుది జట్టుతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌ల పేర్లను అంపైర్లకు అందజేయాలి. ఆ నలుగురిలో నుంచే ఒకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించవచ్చు. తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు కంటే తక్కువ ఉంటే తప్ప ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా కచ్చితంగా భారత క్రికెటర్‌నే ఎంచుకోవాలి.

ముందుగానే తుది జట్టులో ప్రకటించిన ఓ క్రికెటర్‌ స్థానంలో మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఈ ఇంపాక్ట్‌ ఆటగాడిని తీసుకోవచ్చు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్‌ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించొచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్‌ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్‌ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ, ఒక్కసారి ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్‌ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు లేదా ఓవర్‌ ముగిశాక లేదా వికెట్‌ పడ్డాక లేదా ఓ బ్యాటర్‌ రిటైరయ్యాకే ఇంపాక్ట్‌ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. కానీ 11 మంది మాత్రమే బ్యాటింగ్‌కు చేయాలి. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బౌలర్‌ స్థానంలో వచ్చే ఇంపాక్ట్‌ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది.

అయితే ఈ నిబంధన కారణంగా ఆల్‌ రౌండర్ల ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఈ నిబంధన ద్వారా భారత ఆటగాళ్లకు మేలు జరుగుతుందని చెప్పాడు. ఈ రూల్ ప్రకారం భారత యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని చెప్పాడు. 'ఈ రూల్ భారత ఆటగాళ్లకు ప్లాటినమ్ జూబ్లీలాంటిది. ఎందుకంటే ఈ రూల్ ద్వారా భారత ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఆడితే ఈ రూల్ ప్రకారం.. భారత ఆటగాళ్లు 8 మంది ఆడవచ్చు. ఇంతకుముందు వరకు ఏడుగురికే అవకాశం ఉండేదని అకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed