ఐదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ పోరులో ఇండియా, పాకిస్తాన్ ఢీ..

by Vinod kumar |
ఐదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ పోరులో ఇండియా, పాకిస్తాన్ ఢీ..
X

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ జట్లు ఐదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ పోరులో తలపడబోతున్నాయి. 2018 సౌత్ ఏసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎస్‌ఏఎఫ్‌ఎఫ్) చాంపియన్‌షిప్‌‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడగా.. ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే టోర్నీలో ఎదురపడనున్నాయి. భారత్ వేదికగా జూన్ 21 నుంచి జూలై 4 తేదీ వరకు ఎస్‌ఏఎఫ్ఎఫ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ టోర్నీ డ్రాను బుధవారం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) రిలీజ్ చేసింది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భారత్, పాకిస్తాన్‌‌‌లతోపాటు నేపాల్, కువైట్ జట్లు గ్రూపు-ఏలో ఉండగా.. గ్రూపు-బిలో లెబనాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్ జట్లను చేర్చారు.

భారత్, పాక్ జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో టోర్నీపై అంచనాలు పెరిగిపోయాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. జూన్ 21న జరిగే తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత జూన్ 24న నేపాల్‌తో, జూన్ 27న కువైట్‌తో ఇండియా ఆడనుంది. జూలై 1న సెమీ ఫైనల్స్, జూలై 4వ తేదీన ఫైనల్ జరగనుంది. ఎస్‌ఏఎఫ్‌ఎఫ్ కప్‌‌లో భారత్‌కు తిరుగులేని చరిత్ర ఉంది. 8 సార్లు టైటిల్ దక్కించుకోవడంతోపాటు ఇప్పటివరకు జరిగిన 13 ఎడిషన్లలో భారత్ 2003లో మినహా అన్ని ఎడిషన్లలో ఫైనల్‌కు చేరుకుంది.

Advertisement

Next Story