అంత అవసరం లేదు.. జైశ్వాల్ డబుల్ సెంచరీపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |
అంత అవసరం లేదు.. జైశ్వాల్ డబుల్ సెంచరీపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో తొలి డబుల్ సెంచరీ బాదిన టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు అతని ఆటను మెచ్చుకుంటూ పొగడ్తతో ముంచెత్తుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా జైశ్వాల్‌ను అభినందించాడు. ఈ సందర్భంగా అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓవర్‌హైప్ చేసి అతన్ని హీరో చేయొద్దన్నాడు. దీనిద్వారా అతనిపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు.‘జైశ్వాల్ సాధించిన ఘనత పట్ల అతన్ని అభినందిస్తున్నా. కానీ, ముఖ్యంగా అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. అతన్ని ఆడుకోనివ్వండి. మనదేశంలో అందరికీ ఒక అలవాటు ఉంది. ముఖ్యంగా మీడియా ఓవర్‌వైప్ చేసి హీరోలుగా చూపించడాన్ని మనం గతంలో చూశాం. అంచనాలు ఒత్తిడి పెంచుతాయి. దీంతో ఆటగాళ్లు తమ సహజ శైలిలో ఆడలేకపోతున్నారు. అతన్ని ఎదగనివ్వండి. క్రికెట్‌ను ఆస్వాదించనివ్వండి.’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

అలాగే, హైదరాబాద్ టెస్టుతోపాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ దారుణంగా నిరాశపరిచారు. దీంతో వారిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిల్, అయ్యర్‌లకు గంభీర్ మద్దతుగా నిలిచాడు. ‘వారిద్దరూ క్వాలిటీ ప్లేయర్లు. గతంలో వారు తమ సత్తా ఏంటో చూపించారు. అందుకే, వారు భారత్‌కు ఆడుతున్నారు. కాబట్టి, వారికి సమయం ఇవ్వాలి.’ అని గంభీర్ తెలిపాడు. కాగా, రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ 34 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 27 పరుగులకే అవుటయ్యాడు.

Advertisement

Next Story