- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'చిచ్చా' ఇక లేరు

- హైదరాబాదీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత
- చారిత్రాత్మక ఓవల్ టెస్టులో సభ్యుడిగా ఉన్న అలీ
- ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 13 సెంచరీలు, 397 వికెట్లు
- టెస్టుల్లో 47 వికెట్లు, 1018 పరుగులు
- ఫీల్డింగ్‌లో మెరుపు తీగ.. గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్
దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గిల్ కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి గ్లెన్ ఫిలిప్ పట్టుకుంటే వాహ్ అని ఆశ్చర్యపోయాం. వికెట్ల మధ్య కోహ్లీ పరుగులు తీస్తుంటే ఏం ఫిట్నెస్‌రా బాబూ అని అనుకున్నాం. అయితే ఇలాంటి ఫీట్లను 60,70 దశకాల్లోనే చేసిన గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ. హైదరాబాద్ క్రికెట్ సర్కిల్స్‌లో 'చిచ్చా' అని పిలుచుకునే సయ్యద్ అబిద్ అలీ.. అనారోగ్య కారణాలతో తన 83వ ఏట అమెరికాలో బుధవారం మృతి చెందారు. హైదరాబాదీ యువతలో ఉండే ఉత్సాహం, దూకుడుతో ఆనాడు క్రికెటర్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫతేమైదాన్ (ఎల్బీ స్టేడియం)లో గంటల తరబడి ఫీల్డింగ్, బౌలింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. పిచ్ రోలర్ మీద నీళ్లు చల్లి.. బంతిని వేగంగా దానికి కొట్టి.. ఆ బాల్ ఎటు వెళ్తే అటు వేగంగా పరిగెత్తి.. ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అందుకే అప్పట్లోనే గ్రేటెస్ట్ ఫీల్డర్‌గా సయ్యద్ అబిద్ అలీ పేరు మార్మోగిపోయింది.
హైదరాబాద్ డైనమోగా పిలవబడే సయ్యద్ అబిద్ అలీ 2012 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 29.30 సగటుతో 8,732 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక 28.55 సగటుతో 397 వికెట్లు కూడా తీశాడు. ఇందులో 14 ఐదు వికెట్లు ప్రదర్శనలు ఉన్నాయి. అప్పడప్పుడు వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన సయ్యద్ అబిద్ అలీ మొత్తంగా 190 క్యాచ్‌లు పట్టాడు. మరో 5 స్టంపింగ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. భారత్ తరపున 29 టెస్టులు ఆడిన అబిద్ అలీ.. 42.12 సగటుతో 47 వికెట్లు తీశాడు. టీమ్ ఇండియాలో లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా వచ్చిన అలీ 20.36 సగటుతో 1018 పరుగులు చేశాడు. టెస్టుల్లో అలీ 37 క్యాచ్‌లు పట్టాడు. ఫీల్డింగ్‌లో అత్యంత చురుకుగా ఉండే అలీ.. బంతిని ఫ్లాట్‌గా వికెట్లపైకి ఎలాంటి తప్పు జరకుండా విసిరేవాడు.
తొలి రోజుల్లో..
1941 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ.. సెయింట్ జార్జ్‌స్ గ్రామర్ స్కూల్, ఆల్ సెయింట్స్ స్కూల్ తరపున స్కూల్ క్రికెట్ ఆడాడు. కేరళతో జరిగిన ఒక మ్యాచ్‌లో 82 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత అబిద్ అలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేశాడు. అదే సమయంలో హైదరాబాద్ తరపున రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అబిద్ అలీ రంజీల్లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లో మొదటి పరుగు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. టెన్షన్‌తో ఆటపై కాన్‌సన్‌ట్రేషన్ చేయలేకపోయాడు. అయితే వేరే ఎండ్‌లో ఉన్న హైదరాబాద్ కెప్టెన్ ఎంఎల్ జయసింహ అతనికి భరోసా ఇచ్చాడు. ఒక్క సింగల్ తియ్యి.. నీ టెన్షన్ పోతుందని చెప్పాడు. అలా తొలి మ్యాచ్‌లో 51 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఎంఎల్ జయసింహను అతను గురువుగా భావించాడు.
1967లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో సయ్యద్ అబిద్ అలీ లాంగ్ ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అతని కెరీర్‌లో టెస్టుల్లో ఏకైక ఐదు వికెట్ల ప్రదర్శన అదే కావడం గమనార్హం. 1971లో వాంఖడే నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ జట్టులో సయ్యద్ అబిద్ అలీ సభ్యుడిగా ఉన్నాడు.భారత జట్టు విదేశాల్లో సాధించిన మొదటి మూడు విజయాల్లో అబిద్ అలీ భాగస్వామ్యం ఉండగం గమనార్హం. 1974లో ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు అలీ ఆఖరి టెస్టు. ఇక అలీ తన కెరీర్‌లో ఐదు వన్డేలు మాత్రమే ఆడాడు. తొలి వన్డే వరల్డ్ కప్‌లో కూడా అబిద్ అలీ టీమ్ ఇండియా తరపున ఆడాడు.
1980లో అబిద్ అలీ అమెరికాలోని కాలిఫోర్నియాకు షిఫ్ట్ అయ్యాడు. 1990ల్లో మాల్దీవులకు, 2001-02లో ఆంధ్రా రంజీ జట్టుకు, 2002 నుంచి 2005 వరకు యూఏఈ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. సయ్యద్ అబిద్ అలీ కుమారుడు సయ్యర్ ఫకీర్ అలీ భారత జట్టు మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ కూతురుని పెళ్లి చేసుకున్నాడు. నార్తరన్ కాలిఫోర్నియా క్రికెట్ అసోసియేషన్ తరపున ఒక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో తీవ్రమైన గుండె పోటుతో ఫకీర్ అలీ 2008లో చనిపోయాడు. అప్పటి నుంచి సయ్యద్ అబిద్ అలీ మానసికంగా చాలా కుంగిపోయాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అలీ.. కాలిఫోర్నియాలో మృతి చెందాడు.