రోహిత్ శతక్కొట్టాడు.. మరి కోహ్లీ పరిస్థితి ఏంటి?.. ఆందోళన పెంచుతున్న విరాట్ ఫామ్

by Harish |
రోహిత్ శతక్కొట్టాడు.. మరి కోహ్లీ పరిస్థితి ఏంటి?.. ఆందోళన పెంచుతున్న విరాట్ ఫామ్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియాను ఎక్కువగా కలవరపెడుతున్న అంశాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామే ప్రధానమైనదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలంగా వీరిద్దరూ ఫామ్ లేమితో తంటాలు పడటమే అందుకు కారణం. అయితే, ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో రోహిత్ చెలరేగి ఆడాడు. కటక్‌లో విధ్వంసం సృష్టించిన అతను 90 బంతుల్లో 119 రన్స్ చేశాడు. అందులో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్‌కు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలకు, తన ఫామ్‌పై అనుమానాలను పటాపంచలు చేశాడు. ఐసీసీ టోర్నీకి ముందు రోహిత్ ఫామ్ అందుకోవడం భారత్‌కు భారీ ఊరట. రెండో వన్డేలో గెలవడంతో వన్డే సిరీస్ భారత్ సొంతమైంది. సిరీస్ దక్కిన ఆనందం కంటే రోహిత్ తిరిగి ఫామ్ అందుకోవడమే అభిమానులను ఎక్కువగా సంతోషానికి గురిచేస్తోంది. ఇక, ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీపైనే. విరాట్ కూడా పుంజుకుంటే భారత్‌కు తిరుగుండదు.

గతేడాది నుంచి కోహ్లీ ప్రదర్శన ఏ మాత్రం బాగా లేదు. బాగా ఆడిన మ్యాచ్‌లు వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికా‌పై(76) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టులో 70 రన్స్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫామ్ అందుకోవడానికి దేశవాళీ ఆడినా అక్కడ నిరాశ తప్పలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారీ అంచనాలతో రంజీ మ్యాచ్‌ బరిలోకి దిగిగా నిరాశపరిచాడు. రైల్వేస్ తరపున ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన కోహ్లీ 6 పరుగులే చేసి మైదానం వీడాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనైనా పుంజుకుంటాడని అభిమానులు ఆశతో ఉన్నారు. మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. ఆడిన రెండో వన్డేలో కూడా పేలవ ఫామ్ కొనసాగిస్తూ 5 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో కోహ్లీ ఫామ్‌ జట్టును ఆందోళన గురిచేస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ అందుకోవడానికి కోహ్లీ మిగిలిందే ఆఖరి వన్డే మాత్రమే. మూడో మ్యాచ్‌లో విరాట్ రాణించాలని జట్టుతోపాటు అభిమానులు ఆశిస్తున్నారు.

కోహ్లీకి కొత్త కాదు

కోహ్లీకి ఇలాంటి పరిస్థితి కెరీర్‌లో కొత్త కాదు. ఆటలో వెనుకబడిన ప్రతిసారి పుంజుకున్న సందర్భాలెన్నో. ఒకే ఒక్క ఇన్నింగ్స్ చాలు కోహ్లీ ఫామ్ అందుకోవడానికి. 2022 సెప్టెంబర్‌కు ముందు విరాట్ ఇంతకంటే దారుణమైన ఫామ్‌ను చూశాడు. 2019 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు రెండేళ్లపాటు అతని ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. 2022లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీ చేశాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో ఫామ్ అందుకున్న అతను ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 2023లో భీకర ఫామ్ కనబరిచాడు. అఫ్గాన్‌పై సెంచరీతో సహా గతేడాది ఆసిస్‌పై కొట్టిన సెంచరీ వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 11 శతకాలు బాదాడు. దాదాపు 17 హాఫ్ సెంచరీలు చేశాడు.

చాంపియన్స్ ట్రోఫీలో విరాట్‌కు మంచి రికార్డు

చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు మూడు చాంపియన్స్ ట్రోఫీలు(2009, 2013, 2017) ఆడాడు. 13 మ్యాచ్‌ల్లో 529 రన్స్ చేశాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ 4వ స్థానం. ధావన్(701), గంగూలీ(665), రాహుల్ ద్రవిడ్(627) అతని కంటే ముందున్నారు.




Next Story