రెండో టైటిల్‌పై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్

by John Kora |
రెండో టైటిల్‌పై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్
X

- కీలక ప్లేయర్లను కోల్పోయిన ఆర్ఆర్

- విదేశీ బ్యాటర్ హిట్‌మెయర్ ఒక్కడే

- బౌలింగ్‌ భారం ఆర్చర్‌పైనే

- సంజూ శాంసన్ ఫామ్‌ను కొనసాగిస్తాడా?

- ద్రవిడ్ రాకతో తలరాత మారుతుందా?

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ అంటే రాజస్థాన్ రాయల్స్ అని చెప్పవచ్చు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అనామక జట్టుగా ఉండి టైటిల్ ఎగరేసుకొని పోయిన రాజస్థాన్ జట్టు.. రెండో టైటిల్ కోసం 17 ఏళ్లుగా ఎదురు చూస్తుంది. ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌ప్రిడిక్టబుల్ జట్టుగా ముద్ర వేసుకున్న రాజస్థాన్ జట్టు, ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇది నిజమే అని అనక తప్పదు. గత సీజన్‌లో తొలి తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిదింటిని గెలిచన ఆర్ఆర్ జట్టు.. టాప్-2లో కచ్చితంగా ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి, ఒక మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఇక ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించినా.. రెండో క్వాలిఫయర్‌లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.

ఈ సారి జట్టు పరిస్థితి ఏంటి?

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మెగా వేలంలో జాస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆర్.అశ్విన్‌లను తిరిగి కొనుగోలు చేయలేదు. అయితే జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, వానిందు హసరంగ, మహీశ్ తీక్షణ‌ కోసం జట్టు రూ.28.65 కోట్లు ఖర్చు చేసింది. ఆర్ఆర్ జట్టులోకి విదేశీ బ్యాటర్లను కొనుగోలు చేయలేదు. అయితే షిమ్రోన్ హిట్‌మెయిర్‌ను రిటైన్ చేయడంతో.. ఇప్పుడు అతను ఒక్కడే విదేశీ బ్యాటర్‌గా ఉన్నాడు. అయితే అతను గాయపడినా, ఫామ్‌ను కోల్పోయి జట్టుకు సమస్యగా మారితే మాత్రం మరో విదేశీ బ్యాటర్ అందుబాటులో లేడు. అయితే రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ 5 ఆటగాళ్లు భారతీయులే ఉన్నారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో కీలకంగా మారనున్నారు. ఇక వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేశారు. అతడిని కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఛేజింగ్ సమయంలో తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఆర్ఆర్ జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా లేకపోవడం వారికి మైనస్‌గా మారనుంది.

బౌలింగ్..

జోఫ్రా ఆర్చర్ ఐదేళ్ల తర్వాత తిరిగి రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. దీర్ఘకాలిక మోచేయి, వెన్ను సమస్యల తర్వాత జట్టులోకి తిరిగిరావడం వారికి ప్లస్ పాయింట్. అయితే అతని గాయాల చరిత్రను గమనించి జాగ్రత్తగా వాడటం ఆర్ఆర్ ముందున్న పెద్ద సవాలు. ఇక విదేశీ పేసర్లు ఫజల్ హక్ ఫరూఖీ, క్వేనా మఫాకా కూడా ఉన్నారు. ఇద్దరూ ఎడమ చేతి వాటం బౌలర్లు కావడం జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే ట్రెంట్ బౌల్ట్ మాదిరిగా వీరు ఏ మేరకు రాణిస్తారనేది వేచి చూడాలి.

సంజూ శాంసన్ గత నెలలో వేలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. బీసీసీఐ వైద్య బృందం నుంచి అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావల్సి ఉంది. అయితే ఆర్ఆర్ జట్టు మార్చి 23న తమ తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. మరి ఆ రోజుకల్లా శాంసన్ జట్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. ఒక వేళ శాంసన్ ఆడకపోతే అది జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ద్రవిడ్ రాకతో..

ఆర్ఆర్ జట్టుకు కొత్త కోచింగ్ టీమ్ వచ్చింది. భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ వారి ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు. ప్రస్తుతం గాయంతో ఉన్నా.. జట్టును మెగా లీగ్ కోసం సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాడు. ఇక బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే జట్టుకు తప్పకుండా ప్లస్ అవుతారు.

జట్టు అంచనా :

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హిట్‌మెయర్, వానింది హసరంగా, శుభమ్ దూబే/ఆకాశ్ మధ్వల్, జోఫ్రా ఆర్చర్/థెక్సానా మహ్లాక్, ఫారూఖీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే/వైభవ్ సూర్యవంశీ (కంకషన్ సబ్‌స్టిట్యూట్)

Next Story

Most Viewed