- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రాణాలు తీస్తున్న పోలీసు ఎంపిక పరీక్షలు

Police selection: యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది ఒక కల. అందులోనూ చాలామందికి పోలీసులాంటి యూనిఫాం సర్వీసులో పనిచేయాలని ఉంటుంది. దీంతో ఆ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. ఒక్కో పోస్టుకు వేలమంది దరఖాస్తు చేయడంతో వారిని వడపోసేందుకు రిక్రూట్‌మెంట్ బోర్డు కఠిన పరీక్షలు పెడుతున్నది. అయితే, అవి శారీరక పరీక్షలు కావడం.. అందులో పాల్గొన్న కొందరి ప్రాణాలు పోతుండటంతో అసలు ఈ తరహా పరీక్షలు ఎంతవరకు అవసరం అన్న ప్రశ్న చాలామందిలో వ్యక్తమవుతున్నది. అభ్యర్థులను వడపోసేందుకు పరీక్షలు కఠినం చేయకుండా ఇంకా వేరే మార్గాలు ఎంచుకోవడం మంచిదన్న సూచనలు వస్తున్నాయి. మొత్తంగా పోలీసు కావాలనే కలతో వారు పరుగులు తీసే మార్గం ఓ హంతకపు దారిలా మారుతున్నది. జీవితంలో గెలిచేందుకు పరిగెత్తిన ఆ కొంత సమయం మరణాన్ని ఆవహించేలా చేస్తున్నది. 2011లో ఉత్తప్రదేశ్‌లో జరిగిన ఘటన అయినా, 2022లో తెలంగాణలో జరిగిన విషాదమైనా, 2025లో వైజాగ్‌లో పరుగులు తీస్తూ కానరాని లోకాలకు వెళ్లిన శ్రవణ్ కుమార్ ఎపిసోడ్ అయినా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఇంతకీ లోపం ఎక్కడ ఉంది? అభ్యర్థుల్లోనా? వ్యవస్థలోనా? పరీక్షా విధానంలోనా? పోలీసు ఎంపిక పరీక్షలపై దిశ ప్రత్యేక కథనం. -వెన్నెల
ప్రాంతం ఏదైనా మరణం తప్పలే..
జనవరి 23, 2025.. ప్రాంతం విశాఖపట్నం.. ఓ యువకుడు తన కోసం, కుటుంబం కోసం.. జీవితంలో ఎదగాలన్న ఆశతో ఆ రోజు ఎంతో ఉత్సాహంగా నిద్ర లేచాడు. అతని పేరు శ్రవణ్‌కుమార్.. అతని కల.. పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందడం. ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. కుటుంబానికి అండగా ఉందామన్న అతడి ఆశలు అడియాశలు అయ్యాయి. చివరికి పోలీసు నోటిఫికేషన్ పడటంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే ఎంపిక పరీక్షల తేదీ రాగానే వచ్చింది. ఆ రోజు ఉదయమే లేచి పోలీసు మైదానానికి వెళ్లాడు.. 1600 మీటర్ల పరుగు పందెం అతడి, ఆ కుటుంబం ఆశలు కూల్చేసింది. పరుగు పెడుతున్న శ్రవణ్ ఒక్కసారిగా మధ్యలోనే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడు. ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు. 2024 సెప్టెంబర్‌లో జార్ఖండ్‌లో 11మంది అభ్యర్థులు 10 కిలోమీటర్ల పరుగు పందెంలో మరణించారు. 2022 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) నుంచి స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) ఆఫ్ పోలీస్ నియామకానికి పోటీ పడుతున్న 26 ఏళ్ల రాజేంద్ర గుండెపోటుతో మరణించడం కూడా తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదానికి కారణమైంది. 2011 ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లో పదోన్నతి కోసం పరిగెడుతూ ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. సబ్-ఇన్‌స్పెక్టర్లుగా మారడానికి కానిస్టేబుళ్లు 10 కిలోమీటర్లు మారథాన్ పరుగు పందెం చేయడం తప్పనిసరి. అయితే కానిస్టేబుళ్లలో చాలామందికి ఫిట్‌నెస్ లేకపోయినా.. ప్రమోషన్ పొందాలన్న ఆశతో ఫిజికల్ టెస్ట్‌కు హాజరు కావడమే వారి ప్రాణాలు తీసింది.
ఇతర దేశాల్లో పరీక్షలు ఎలా?
పోలీస్ ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని ప్రధానంగా అంచనా వేస్తారు. ఈ పరీక్షల ప్రమాణాలు అన్నీ దేశాల్లోనూ ఒకే రకంగా లేవు. అమెరికా, యూకే లాంటి దేశాల్లో, ఫిజికల్ టెస్టులు అభ్యర్థుల వయస్సు, లింగం ఆధారంగా మారుతాయి. భారత్‌లో మాత్రం ఒకే ప్రమాణంలో ఉంటాయి. ఇది అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని సమీక్షించడానికి సముచితం కాదన్న వాదన కూడా ఉంది. యూఎస్‌లో పోలీస్ శిక్షణా కాలం సుమారు 18 నుంచి 21 నెలలు ఉంటుంది. పరీక్షల్లో పుష్-అప్స్, సిట్-అప్స్, 2.4 కిలోమీటర్ల పరుగుపందెం ఉంటాయి. అయితే, ఈ ప్రమాణాలు అక్కడి రాష్ట్రాల వారీగా మారుతాయి. ఇటు మనదేశంలో పోలీస్ శిక్షణా కాలం సుమారు 6 నెలలు నుంచి 9 నెలలపాటు ఉంటుంది. పరీక్షలలో సాధారణంగా పుష్-అప్స్, సిట్-అప్స్, 1.6 కిలోమీటర్ల పరుగుపందెం ఉంటాయి. ఇక ఈ పరీక్షల కాఠిన్యత, వాతావరణ పరిస్థితులు, శిక్షణా ప్రమాణాలు రాష్ట్రాల వారీగా మారుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో 25 నిమిషాల్లో 5 కిలోమీటర్ల పరుగు పందెం ఉండేది. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగించేలా 1600మీటర్ల పరుగుపందెం మాత్రం ఉంచారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో లాంగ్ జంప్, 4మీటర్లు, షాట్ పుట్ (7.26కిలోలు) 6మీటర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా చాలా కఠినమైన పరీక్షలు అమలు చేస్తున్నాయి. అయితే ఇతర దేశాల్లో ప్రతీ వ్యక్తికి ఒకేరకమైన శిక్షణ, పరీక్షలు ఉండవు.. అంతేకాకుండా ప్రస్తుతమున్న ప్రక్రియలోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న వాదన ఎప్పటినుంచో ఉంది.
స్టామినా తగ్గడమే కారణమా?
యువతలో శారీరక శ్రమ, స్టామినా తగ్గడమనే సమస్య ఒక పెద్ద చర్చగా మారింది. నేటి యువతకు అవసరమైన శారీరక శ్రమ తక్కువగా ఉండటం, సాంకేతిక ఆధారిత జీవితశైలి, అనియంత్రిత ఆహారం వలన యువతలో శరీర సహనశక్తి మరింత తగ్గుతున్నది. అధ్యయనాల ప్రకారం, 20 సంవత్సరాల వయస్సులోనూ యువత చాలా శారీరక బలహీనత ఎదుర్కొంటున్నది. ఈ కారణంగా ఫిజికల్ టెస్టుల్లో విఫలమవుతున్నారు. భారత్‌లో 15-17 సంవత్సరాల వయస్సు గల యువతలో 25.2శాతం మంది మోస్తరు నుంచి తీవ్ర శారీరక శ్రమ మార్గదర్శకాలను పాటించడం లేదు. అదే సమయంలో 20శాతం మంది యువత పూర్తిగా శారీరక శ్రమ చేయడం లేదు. 37శాతం మంది తక్కువ శారీరక శ్రమ చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. పోషకాహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ లేకపోవడం వల్ల శరీర శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐరన్, విటమిన్ డీ, మ్యాగ్నీషియం లోపాలు శరీరంలో శక్తి క్షీణతకు కారణంగా మారాయి.
ఆహారపు అలవాట్ల ప్రభావం
నేటి యువతలో శారీరక శ్రమ తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అసమతుల్య ఆహారపు అలవాట్లు. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, తక్కువ పోషక విలువ కలిగిన ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు. ఇది శారీరక శ్రమను ప్రభావితం చేస్తుంది. ఆహారపు అలవాట్లకు, శారీరక శ్రమ మధ్య సంబంధం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్, తక్కువ పోషక విలువ కలిగిన ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. ఇది శారీరక శ్రమను మెరుగుపరచుతుంది. అటు వైట్ బ్రెడ్, ప్యాకెట్ ఫుడ్ లాంటి వాటికి అధికంగా అలవాటు పడటం, శరీరాన్ని మరింత బలహీనపరుస్తున్నాయి. ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఆహారాలైన ఇన్‌స్టంట్ నూడిల్స్, చిప్స్, బిస్కెట్లు, ఫ్రోజన్ ఫుడ్ తక్కువగా తినాల్సి ఉంటుంది. ఈ ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్లాస్టిక్ రసాయనాలు, ప్రజెర్వేటివ్స్, అదనపు రసాయనాలు ఉంటాయి, ఇవి శరీరంలో కొవ్వు నిల్వలను పెంచి శక్తిని తగ్గిస్తాయి. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఆహారాలు కొవ్వులు, సోడియంతో పాటు అసాధారణ రుచి పెరిగే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి హార్ట్ డిసీజ్‌లకు, స్టామినాలో తగ్గుదలకు, శరీరంలోని సక్రమమైన మెటబాలిజం తగ్గడానికి కారణమవుతాయి. ఇక అధిక పంచదార రక్తంలో గ్లూకోజ్ స్థాయి మార్పులకు కారణమవుతుంది, ఇది శక్తి పతనానికి దారి తీస్తుంది. నాన్-ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో పెస్టిసైడ్స్ ఉండడం శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
మరణాలకు వైద్య కారణాలు
అందరికీ తెలిసిన విషయం, భారత్‌లో ఎటువంటి పరీక్షనైనా సీరియస్‌గా తీసుకున్నప్పుడు, అసలు పరీక్షే వారిని మరణానికి దగ్గర పెడుతుంది. హృద్రోగాలు, అధిక బరువు, హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ లాంటివి పరుగులపందెంలో అభ్యర్థులు మరణించడానికి ప్రధాన కారణాలు. ఎక్కువ శ్రమతో, శరీరం మానసికంగా కఠినంగా ఉండటం వలన గుండెపోటు, శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. అతిగా శ్రమకు గురైన శరీరం దెబ్బతింటుంది. శరీర సామర్థ్యానికి మించి శ్రమ చేయడం వల్ల, దాన్ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. నిజానికి ప్రతి వ్యక్తికి పరుగెత్తడం, శారీరక శ్రమ చేయడం అనేది సాధారణంగా శరీరాన్ని ఉల్లాసంగా ఉంచే ప్రక్రియ. కానీ కొన్ని సందర్భాల్లో రన్ టెస్టులు చేసే అభ్యర్థులు ముందుగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కార్డియక్ అరెస్టుకు గురవుతారు. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో కొవ్వు జమ అవడం వల్ల రక్తప్రవాహం ఆగిపోతే కరినరీ ఆర్టరీ డిసీజ్‌తో చనిపోయే ప్రమాదముంటుంది. పరుగుతున్న సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోవడం వల్ల హీట్ స్ట్రోక్ (Heat Stroke) సంభవించవచ్చు. ఇది ఎలక్ట్రోలైట్ లోపం.. అంటే శరీరంలో తగినంత నీరు లేదని అర్థం. ద్రవ పదార్థాలు, సోడియం స్థాయిలు సక్రమంగా లేకపోతే పరుగు మధ్యలోనే కుప్పకూలిపోవాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయాలు ఏంటి?
అవసరమైతే, పోటీ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాణాలను కాపాడడానికి మెరుగైన ప్రమాణాలు ఏర్పడాలి. మరొకటిగా, అమెరికా, కెనడాలో జారీ చేసిన ఫిజికల్ పరీక్షలు, అభ్యర్థుల ఆరోగ్యం, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు గుండెపోటు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న అభ్యర్థుల కోసం పరుగు పందెంలో, రేస్ రూట్‌లో జాగ్రత్తలు పాటిస్తారు. ఇండియాలో కూడా అలానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరుగు, ఈవెంట్స్ పోటీలకు ఉదయం 5గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటినుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు. ఈక్రమంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు అభ్యర్థులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. దీంతో వారి శరీరం డీ హైడ్రేట్ అయ్యి.. ప్రాణాంతకంగా మారుతుంది. అలా కాకుండా ఆలస్యం అయ్యే క్రమంలో వారికి తగినంత గ్లూకోజ్ సహా హైడ్రేట్ అయ్యే ద్రవ పదార్థాలు అందజేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఉద్యోగాల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవడం తల్లిదండ్రులనే కాదు.. సామాన్యులను సైతం కలిచివేస్తున్నది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో పోలీసు ఉద్యోగాలపై యువత ఆసక్తి కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
పాఠశాలల్లో క్రీడలు లేకపోవడం
పెద్ద పెద్ద పుస్తకాలు, కొంతమంది రెండేసి బ్యాగులు పట్టుకెళ్లే చదువులు మనవి. ఆటలకు ఏ మాత్రం స్కోప్ ఇవ్వకుండా బట్టి చదువులతో విద్యార్థులను మెమరీ స్టోర్ చేసుకునే మెషీన్లగా ట్రీట్ చేసే విద్యావ్యవస్థ మనది. ముందు ఈ వ్యవస్థ మారాలి. అసలు లోపమంతా ఈ వ్యవస్థలోనే ఉంది. 100కి 100 మార్కులు వచ్చి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏం ఉపయోగం? స్కూల్స్‌లో అసలు ఆటల పోటీలు జరుగుతున్నాయా? 90 శాతం స్కూళ్లకు అసలు గ్రౌండ్ కూడా ఉండదు. ఒక అపార్ట్‌మెంట్‌లో గోడలు అడ్డంగా కట్టి క్లాసులగా విడగొట్టి పాఠాలు చెబుతారు. పాఠశాలల స్థాయిలో క్రీడా పోటీలు తగ్గిపోవడం, పోలీసు కావాలనుకునే అభ్యర్థులకు మొదటి శాపం. ఆటల పోటీలు శరీర శక్తిని పెంచేందుకు, యువతలో ఆరోగ్యకరమైన పోటీ, ఆత్మాభిమానం కూడా అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరు కలలు కనడం, తమ కుటుంబం కోసం పనిచేయాలనే ఆశను కలిగి ఉంటారు.
అయితే, ఒక్క పరుగు అన్నింటిని ముగించేస్తే ఎలా? ఒక వ్యక్తి మరణించిన తర్వాత బాధిత కుటుంబం చుట్టూ తిరిగే ఆ దుఃఖం, ఆ బాధ ఊహించలేనిదిగా ఉంటుంది. ఈ సన్నివేశంలో ప్రతి ఒక్కరి గుండెల్లో వేదన ఉంటుంది. ఆ వ్యక్తి మరణం గురించి ఆ కుటుంబం ఆలోచిస్తున్నప్పుడు, అది కేవలం జీవితానికి వాస్తవాన్ని పంచే విషాద క్షణం కాదు. అది సమాజం బాధ్యతలను, ఆరోగ్య ప్రయోజనాలను, అర్హతలు పరిగణలోకి తీసుకుని, ఉద్యోగం విధులను జాగ్రత్తగా అందించాలనే సందేశాన్ని ఇస్తాయి. మన సమాజం, మన కుటుంబం, మన పూర్వీకులు ఆహారం, ఆరోగ్యం, జాగ్రత్తలతో కూడిన శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తు చేసుకుంటూ, మనం ఈ విషాదాలను తగ్గించే మార్గాలను మెళకువగా పరిశీలించాలి.