- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Disha Special: ‘ఏఐ’ యమ హుషారు! అత్యాధునిక టూల్స్‌తో ట్యూన్స్ చోరీ

‘హార్ట్ ఆన్ మై స్లీవ్ అనే పాటను 2023లో ఒక ఏఐ టూల్ సృష్టించగా.. అది వైరల్‌గా మారింది. అయితే, ఇది కెనడాకు చెందిన ప్రముఖ సంగీత హిప్ హాప్ కళాకారులు డ్రేక్, ది వీకెండ్ పాడిన పాటల్లోని స్వరాలను పోలి ఉన్నది. ఈ పాటను విన్న చాలామంది ఇది వారి బ్యాండ్ నుంచి వచ్చినదేనని భావించారు. ఈ పాట కూడా చాలా వైరల్ అయ్యింది. అయితే, దీనిని వారు రికార్డ్ చేయలేదు. దీనిని ప్రాంప్టింగులు ఇవ్వడం ద్వారా ఆర్టిఫిషియల్ టూల్ తయారుచేసింది. డ్రేక్, ది వీకెండ్ అభ్యంతరాలు చెప్పడంతో పాట స్ట్రీమింగ్ ని నిలిపివేశారు. ఇది పూర్తిగా చౌర్యం కిందికి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రిటన్ కు చెందిన సారా పాయిజర్ నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఈమె నటించిన మమ్మా మియా మ్యూజిక్ ఆల్బమ్ చాలా ఫేమస్. అనేక ఏళ్లపాటు ఆమె కాన్సర్ట్స్ అనేక దేశాల్లో పాపులర్ అయ్యాయి. అయితే, బీబీసీ వార్తా సంస్థ ఓ ప్రాజెక్ట్ కోసం ఆమె స్వరాన్ని ఏఐ ద్వారా వినిపించారు. ఈ విషయంపై ఆమె సీరియస్ అయ్యారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే బీబీసీ తన వాయిస్‌ను ఎయిర్ చేయడాన్ని తప్పుబట్టారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ మేథో చౌర్యం చేయడంపై కళాకారుల ఆందోళనలకు ఈ రెండు సంఘటనలు అద్దం పడుతాయి. తమకు తెలియకుండానే తమ బాణీలు, స్వరాలను కాపీ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవేకాదు.. ఏఐతో వచ్చిన మార్ఫింగ్ టూల్స్ పై కూడా సెలెబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రష్మికమందానపై వచ్చిన డీప్ ఫేక్ వీడియో ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆ తర్వాత ఇదే టూల్ తో ప్రధాని సహా అనేకమందిపై వీడియోలు వచ్చాయి. దీనివల్ల ఒరిజినల్ ఏది? ఫేక్ ఏది? అనేది తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యంగా మారిందని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాలీవుడ్ పరిస్థికి వస్తే.. సినిమా రచనల్లో ఏఐని ఉపయోగించవద్దని అక్కడి రచయితలు 2023లో ఏకంగా 148 రోజులపాటు సమ్మె చేశారు. ప్రతి రచనకు సంబంధిత వ్యక్తులకు క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ రచనలను ఏఐ శిక్షణ కోసం ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.
ఏఐ తమ ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు బిల్లీ ఐలిష్, కాటీ పెర్రీ వంటి 200 మందికి పైగా ప్రముఖల సంగీతకారులు 2024లో ఒక లేఖపై సంతకం చేశారు, తమ అనుమతి లేకుండా తాము స్వరపర్చిన సంగీతాన్ని ఏఐ డెవలపర్లు ఉపయోగించడం మానేయాలని కోరారు. సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఏకంగా ఉద్యమమే చేపట్టారు. నిజానికి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐ. భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించబోయేది కూడా ఇదే అంటున్నారు నిపుణులు. అయితే దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎన్ని ప్రశంసలు, సానుకూలతలు వ్యక్తం అవుతున్నాయో, అన్ని ప్రతికూలతలు, వ్యతిరేకతలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏఐ మంచిదా..? చెడ్డదా? అనే సందేహాలు సాధారణ పౌరుల్లో తలెత్తుతున్నాయి. ఏఐపై జరుగుతున్న ఆందోళనలపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - ఎండీ జావీద్ పాషా
రాత్రి.. పగలు, చీకటి.. వెలుగు.. మంచి.. చెడు.. ఇలా ప్రతీ విషయంలో పాజిటివిటీ.. నెగెటివిటీ ఉంటాయి. ఆధునిక సాంకేతికత విషయంలోనూ అదే జరుగుతోంది అంటున్నారు నిపుణులు. పైగా ఏ కొత్త మార్పునూ ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ప్రస్తుతం ఏఐ, గ్రోక్ వంటి టెక్నాలజీ విషయంలోనూ ఇది చూడవచ్చు. కానీ భవిష్యత్తులో వీటి అవసరం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మరి హాలీవుడ్ ప్రముఖులు ఎందుకు వ్యతిరేకిస్తు్న్నారంటే.. అందుకు డీప్‌ఫేక్ వంటి సాంకేతిక దుర్వినియోగాలతోపాటు తమ సృజనాత్మకత, వ్యక్తిగత భద్రతకు ఆటంకం కలుగుతోందని వారు ఆరోపిస్తు్న్నారు. పైగా ఏఐని దుర్వినియోగం చేసే యూజర్లు ముందుగా సెలబ్రిటీలపైనే ముందుగా తమ దాడిని ప్రయోగించారు. ఉదాహరణకు ప్రముఖ నటుడు స్కార్లెట్ జోహన్సన్ ఫేక్ వాయిస్‌ను ఆయన అనుమతిలేకుండానే ఏఐ ద్వారా క్రియేట్ చేయడం దుమారం రేపింది. దీంతో ఏఐ వల్ల నష్టం జరుగుతోందని హాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు.
బ్యాన్.. ఏఐ
హాలీవుడ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యుజీషియన్స్ ఇలా మొత్తం వందలమంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఏఐ టెక్నాలజీ లేదా కంపెనీల నుంచి కాపీరైట్ చట్టాలను రక్షించాలని ట్రంప్‌ను ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ వెంటనే నెరవేర్చాలని నిరసనలు తెలిపారు. కాపీరైట్ చేయబడిన కంటెంట్‌పై పరిహారం లేకుండా ఏఐ ట్రైనింగ్‌ను అనుమతించే ఓపెన్ ఏఐ, అలాగే గూగుల్ ప్రతిపాదనలను హాలీవుడ్ సెలబ్రిటీలు వ్యతిరేకిస్తున్నారు. ఏఐ సంస్థలు కార్పొరేట్ లాభం కోసం సినిమాలు, సంగీతం, రచనలను కాపీ చేయడానికి, దోచుకోవడానికి ప్రయత్నిస్తాయని, ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ప్రొషెషన్స్‌కు ఇది ప్రమాదమని హాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. బెన్ స్టిల్లర్, మార్క్ రుఫలో అండ్ పాల్ మెక్కార్ట్నీతో సహా పలువురు సెలబ్రిటీలు ఏఐ కంపెనీలు లీగల్ విషయాలు, చట్టపరమైన మినహాయింపులు కోరే బదులు లైసెన్స్‌లపై చర్చలు జరపాలని, అమెరికా క్రియేటివ్ అండ్ ఇంటెలెక్చువల్ లీడర్ షిప్ ను కాపాడటానికి స్ట్రాంగ్ కాపీరైట్ చట్టాలు అవసరమని వాదిస్తున్నారు.
రాయల్టీ ఏది?
ఆల్గారిథమ్‌ల కోసం, చాట్‌బాట్‌లకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం అనుమతిలేకుండానే తమ క్రియేటివిటీని, వాయిస్‌లను ఏఐ శిక్షణకు ఉపయోగించడడుతున్నాయని హాలీవుడ్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా తమకు మాత్రం రాయల్టీ లభించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఏఐ టెక్నాలజీని ఫేక్ ఫొటోలు, ఫేక్ వాయిస్‌లు, అశ్లీల చిత్రాలు వంటివి రూపొందించడానికి దుర్వినియోగం చేయడంవల్ల నైతిక సమస్యలు తలెత్తుతాయి. మానవ సృజనాత్మకతను యంత్రాలు భర్తీ చేయడంవల్ల కళలో ఆత్మ లోపిస్తుందని హాలీవుడ్ భావిస్తున్నది. మరోవైపు ఉపాధి, ఉద్యోగ భద్రత విషయంలోనూ ఏఐ పలు అనుమానాలకు తావిచ్చింది. అది ఆటోమేటిగ్గా స్క్రిప్ట్ రాయడం, యానిమేషన్ చిత్రాలు క్రియేట్ చేయడం, డబ్బింగ్ చెప్పడం వంటి చేస్తే.. ఇక నటీనటులకు, రచయితలకు, టెక్నీషియన్ల ప్రయారిటీ దెబ్బతినవచ్చు. ఉపాధిలేకుండా పోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన క్రియేటివ్ థాట్స్, రచనలు, మూవీ రిలీజ్ స్క్రిప్టులు, ఆడిషన్స్ వంటివి ముందుగానే లీక్ అవడం, కాపీరైట్ ఉల్లంఘనలు వంటి వాటికి ఏఐ టెక్నాలజీ కారణం అవుతుందని హాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. అందుకే వ్యతిరేకిస్తున్నారు.
ఇతర రంగాల్లో ఏఐ ?
ఏఐ ఆయా రంగాల్లో పనులను సులభతరం చేస్తున్నది. వైద్య, విద్య, వ్యాపార రంగాల్లో ఏఐ టెక్నాలజీ అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వైద్య రంగంలో అయితే రోగ నిర్ధారణ (క్యాన్సర్ గర్తింపు), మెడికేషన్స్ డెవలప్‌మెంట్, రోబోటిక్ సర్జరీస్, ప్రిస్క్రిప్షన్ స్కానింగ్ అండ్ స్టోరేజ్, డేటా ఎనలైజింగ్ వంటి అంశాల్లో ఏఐ తోడ్పడుతోంది. ఇక విద్యారంగంలో పర్సనలైజ్డ్ ఆన్ లైన్ కోర్సులు, ఆటోమేటెడ్ గ్రేడింగ్, స్టూడెంట్స్ ఎబిలిటీ ఎనలైజింగ్ వంటి అంశాల్లో ఏఐ యూజ్ అవుతోంది. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే డేటా ఎనాలిసిస్, కస్టమర్ సర్వీస్‌లో చాట్ బాట్ వినియోగం, సప్లై చైన్ ఆప్టిమైజేషన్ వంటి అంశాల్లో ఏఐ కీ రోల్ పోషిస్తున్నది. ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి పరిశీలిస్తే.. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ ద్వారా మ్యూజిక్ కంపోజిషన్, గేమింగ్ లో నాన్ ప్లేయర్ క్యారెక్టర్స్ వంటివి ఏఐ ద్వారా సాధ్యం అవుతున్నాయి. ఇక వ్యవసాయ రంగంలో పంటలకు వచ్చే చీడ పీడలు వంటివి గుర్తించి సూచనలు చేయడంలో, డ్రోన్‌లతో ఎరువులు చల్లడంలో, వాతావరణ సూచనలను పసిగట్టి వివరించడంలో సహాయపడుతోంది. రవాణా రంగం విషయానికి వస్తే స్వయం చాలక వాహనాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ వంటి అంశాల్లో ఏఐ యూజ్ అవుతోంది. సైన్స్ పరంగా చూస్తే.. వాతావరణ మార్పుల అధ్యయనంలో, ఖగోళ శాస్త్రంలో కొత్త ప్లానెట్స్, అక్కడి పరిస్థితులను గుర్తించడంలో, అంచనా వేయడంలో ఏఐ ఉపయోగపడుతోంది.
ఏఐతో లాభాలు
టెక్నాలజీ వల్ల ఉపయోగాలతోపాటు పలు లాభ నష్టాలున్నాయి? లాభాల విషయానికి వస్తే.. క్లిష్టమైన పనులను సైతం వేగంగా, కచ్చితంగా పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు డాటా ఎనలైజింగ్. అట్లనే కొత్త ఔషధాలు, సాంకేతిక పరిస్కారాలు, క్రియేటివ్ కంటెంట్ క్రియేటింగ్ వంటి విషయాల్లో ఏఐ ఉపయోగపడుతుంది. వికలాంగులైన వ్యక్తులకు ఉపయోగపడే సహాయక టూల్స్ రూపకల్పనలో, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరించడంలో యూజ్ అవుతుంది. ఆటోమేషన్ ద్వారా వ్యాపారాలు, సేవలు విస్తరించడంలో ఏఐ ఉపయోగపడటంవల్ల ఖర్చులు తగ్గుతాయి. ఇక గనులు, కొండ చరియలు, సొరంగాలు, అగ్నిమాపక స్థలాలు వంటి చోట్ల ఏఐ ఆధారిత రోబోట్లను ఉపయోగించవచ్చు.
ఏఐతో నష్టాలు
ఏఐ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయా రంగాల్లో ఆటోమేషన్ టెక్నాలజీ ప్రవేశ పెట్టడం ద్వారా కార్మికులు, క్లర్కులు, డ్రైవర్లు వంటి ఉద్యోగాల అవసరం తగ్గుతుంది. అట్లనే వ్యక్తిగత, నైతిక భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డేటా సేకరణ, నిరంతర నిఘావల్ల ఒకరి పర్సనల్ విషయాల్లో సమస్యలకు కారణం కావచ్చు. ముఖ్యంగా డీప్‌ఫేక్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా నష్టం చేకూరుస్తుంది. అట్లనే ఏఐ అల్గారిథమ్‌లలో జెండర్ అండ్ రేస్ బేస్డ్ పక్షపాతానికి అవకాశం ఉండొచ్చు. ఇక ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు, ముఖ్యంగా యుద్ధం వంటి సమయాల్లో నియంత్రణ కష్టం కావచ్చు.
ఏఐ ఎందుకు అవసరం?
ఆధునిక సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ చాలా ముఖ్యం. ముఖ్యంగా వాతావరణ మార్పు, జనాభా పెరుగుదల, వైద్య రంగంలో తలెత్తుతున్న సవాళ్లు సులభంగా పరిష్కరించాలంటే ఏఐ అవసరం చాలా ఉంది. ఇదొక పవర్ ఫుల్ టూల్ అంటున్నారు నిపుణులు. పోటీ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు ఆయా దేశాలు ముందుండాలంటే ఏఐ అవసరం. వేగవంతమైన రోగ నిర్ధారణ, ఆరోగ్య సంరక్షణలో సౌలభ్యం, నైపుణ్య శిక్షణ, కాలుష్య నియంత్రణ, స్థిరమైన వనరుల వినియోగం వంటి అంశాల్లో ఏఐ అవసరం. అట్లనే అతిగా ఆధారపడితే మానవ సామర్థ్యాలు, సంబంధాలు, సంప్రదాయాలు, నైతిక విలువలు క్షీణించే ప్రమాదం కూడా ఉంది.
వివాదాల్లో ఏఐ టూల్స్ (బాక్స్)
చాట్ జీపీటీ: టెక్స్ట్ రచన కోసం ఉపయోగించే ఏఐ టూల్, ఇది స్క్రిప్ట్‌లు, పాటల సాహిత్యం, లేదా కథలను రాయగలదు.
సునో ఏఐ: సంగీతాన్ని సృష్టించే టూల్, ఇది టెక్స్ట్ ఇన్‌పుట్ ఆధారంగా పూర్తి పాటలను జనరేట్ చేస్తుంది. దీనిపై రికార్డ్ లేబుల్స్ కాపీరైట్ ఉల్లంఘన కేసు దాఖలు చేశాయి.
యూడియో ఏఐ: ఇది కూడా సునో లాంటిదే, ఇది కూడా ఏఐ ద్వారా సంగీతాన్ని సృష్టిస్తుంది. ఇది కూడా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంది.
లోవో: స్వరాలను క్లోన్ చేసే ఏఐ టూల్, దీనిపై వాయిస్ యాక్టర్లు కేసు వేశారు, ఎందుకంటే ఇది వారి స్వరాలను అనుమతి లేకుండా ఉపయోగించింది.
జూక్ బాక్స్ (ఓపెన్ ఏఐ): ఒక నిర్దిష్ట కళాకారుడి శైలిలో సంగీతాన్ని జనరేట్ చేయగల టూల్.