వైద్య సిబ్బందికి రవాణా సదుపాయాలు..

by Shyam |
వైద్య సిబ్బందికి రవాణా సదుపాయాలు..
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కోవిడ్ 19 నివారణలో విశేషంగా కృషి చేస్తోన్న వైద్య సిబ్బందికి ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అత్యవసర సామగ్రి తరలింపు, సిబ్బంది వెళ్లడానికీ ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. ఈ మేరకు అధికారులు బస్సులు సిద్ధం చేస్తున్నారు.

ఉదయం..మధ్యాహ్నం..సాయంత్రం వేళల్లో..

ఉదయం 7:30 గంటలకు, మధ్యాహ్నం 1:30, సాయంత్రం 7:30 గంటల సమయంలో ఈ బస్సులు తిరగనున్నాయి. హసన్‌పర్తి, మడికొండ, ఆరెపల్లి, నాయుడు పంపు, గొర్రెకుంట ప్రాంతాల నుంచి ఎంజీఎం వరకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసారు. ఐడీ కార్డులు చూపించి అత్యవసర సిబ్బంది ఈ బస్సుల్లో ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ నుంచి అత్యవసర సేవలను మినహాయించారు. వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖలు 24 గంటలు పని చేస్తున్నాయి. వైద్య సిబ్బంది విధులకు హాజరయ్యే క్రమంలో పలు ఇబ్బందులు ‌ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పోలీసుల దాడులు తప్పడం లేదు. దీంతో సంబంధీకులు విధులకు హాజరయ్యేందుకు ఆందోళన ‌చెందుతున్నారు. బాధితులు తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టి‌కి‌ తీసుకెళ్లారు. ఈ మేరకు ఆ సమస్య‌ను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 7 రూట్లలో బస్సులను నడపనున్నారు. వైద్య సిబ్బందికి పోలీసులతో నిత్యం అడ్డంకులు ఏర్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఇన్‌చార్జి ఆర్ఎం శ్రీదేవి తెలిపారు.

కరోనా మహమ్మారి కట్టడికి 15 వేల బెడ్లు..

అత్యవసర వైద్యసేవల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 15వేల ఐసోలేషన్ బెడ్లు, కిట్లు ఏర్పాటు‌ చేసినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో 3 ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ, నక్కలగుట్ట‌లోని హరిత కాకతీయ హోటల్, అతిథి గృహాల్లో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం ఆసుపత్రి కార్య నిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో ఐసొలేషన్ వార్డుకు తహసీల్దార్ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్లు ఆయన తెలిపారు.

Tags : special vehicles, doctors, coronavirus (covid-19), prevention

Advertisement

Next Story