ఇలాంటి పరిస్థితులు… తమకు సర్వసాధారణం

by Shyam |   ( Updated:2020-08-21 05:43:06.0  )
ఇలాంటి పరిస్థితులు… తమకు సర్వసాధారణం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారిని నాశనం చేసేందుకు మానసిక ధైర్యం అత్యంత ప్రధానమైనదని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రమాద పరిస్థితుల్లో శాంతిభద్రతల కోసం విధులు నిర్వర్తిస్తూ, కరోనా సోకిన వారిలో 32 మంది పోలీసు అధికారులు సంపూర్ణ ఆరోగ్యవంతులై విధుల్లో చేరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో వారిపై పూలజల్లు కురిపిస్తూ ఎస్పీ స్వయంగా స్వాగతించారు.

ఈ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఇటువంటి గడ్డు పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదని, కాలంతో పాటుగా ప్రయాణం చేస్తూ, అవరసమైతే కాలానికి ఎదురు నిలిచి పోరాటం చేయాలని సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు పోలీసు వృత్తిలో సర్వసాధారణమని అన్నారు. మనిషి ఒంటరి జీవి కాదని, రక్త సంబంధం ఉన్నవారినే కాకుండా మన ఇరుగుపొరుగు, నిత్యం కలిసి జీవించేవారందరినీ కుటుంబ సభ్యులుగా భావించడంలోనే మరింత ధైర్యం, సంతోషం లభిస్తోందని ఎస్పీ తెలిపారు. కరోనా ప్రాణాంతకం కాదని, దీనిని ప్రతిఒక్కరూ గ్రహించాలని, అదేవిధంగా కరోనా సోకిన వారి పట్ల సమాజం ప్రేమ భావంతో మెలగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

కరోనా సమయంలో సమాజ పరిరక్షణకు పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన కష్టం ఎన్నటికీ మరువలేనిదని ఎస్పీ ఉద్వేగంతో అన్నారు. పోలీసులు అనారోగ్యంతో ఉన్నప్పుడు, తమకు ఆర్థిక సహాయం అందించి, ఇంటికి నేరుగా పాలు, నిత్యావసర వస్తువులు అందిస్తూ, స్వయంగా తమతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ధైర్యం నూరిపోసిన ఎస్పీకి సోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాధి సోకిన సిబ్బంది అందరికీ ప్రతిరోజూ ఇంటికి వెళ్లి నిత్యావసర వస్తువులు అందించిన హెడ్ కానిస్టేబుల్ ధనుంజయను ఎస్పీ ఘనంగా సన్మానించారు.

Advertisement

Next Story