22న సోనియా నేతృత్వంలో విపక్ష నేతల భేటీ

by vinod kumar |
22న సోనియా నేతృత్వంలో విపక్ష నేతల భేటీ
X

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు విపక్ష నేతలు ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో దాదాపు 18 పార్టీల నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వలస కార్మికుల సమస్యలు, కార్మిక చట్టాలపై కొన్ని రాష్ట్రాల నిర్ణయాలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌‌లో పాల్గొనాలని ఇప్పటికే 18 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపాయి. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉంది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కానీ, ప్రతిపక్ష నేతలు ఎక్కడివారక్కడే మిగిలిపోయారు. రాహుల్ గాంధీ పలుమార్లు విలేకరులతో సమావేశమవడం, ప్రభుత్వ చర్యలపై అభిప్రాయాలు వెల్లడించడం చేశారు. కానీ, ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ కావడం ఈ లాక్‌డౌన్ సమయంలో ఇదే మొదటిసారి. లాక్‌డౌన్ తర్వాత మోడీ, అమిత్ షాలు.. ప్రతిపక్ష నేతల నోరునొక్కే యత్నం చేశారని ఓ నేత చెప్పారు. అందుకే, లాక్‌డౌన్ సడలింపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు యాక్టివ్ అవుతున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story