పరుల పాలవుతున్న ఆలయ భూములు.. పట్టించుకోని అధికారులు

by Shyam |   ( Updated:2021-10-09 01:03:16.0  )
పరుల పాలవుతున్న ఆలయ భూములు.. పట్టించుకోని అధికారులు
X

దిశ , మర్రిగూడ : మండలంలోని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న నీలకంఠ రామ స్వామి దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో దేవాదాయ శాఖ భూముల పక్కన రైతులు ఆక్రమించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్లగూడెం గ్రామంలో నీలకంఠ రామస్వామి దేవాలయం ఉంది. దీని పరిధిలో సుమారు 90 ఎకరాలు భూములు ఉన్నాయి. 50 సంవత్సరాల క్రితం కొంతమంది దాతలు 90 ఎకరాల ను దేవాలయం కు దానం ఇచ్చారు. ఆలయ భూములు ఒకే దగ్గర కాకుండా శివన్న గూడెం, ఇందుర్తి, మేటి చందాపురం గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఇందుర్తి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 989 నుండి 1010 కొరకు భూములు విస్తరించి ఉన్నాయి.

ఈ భూములన్నీ దేవాదాయ శాఖ పరిధిలో సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. ఆలయ సిబ్బంది ప్రతి యేడు ఈ భూములను ఆలయ భూముల సరిహద్దులు ఉండే రైతులకు కౌలుకు ఇస్తుంటారు. ఆ డబ్బులను దేవాదాయ శాఖ ఖాతాలోనే జమ చేయాల్సి ఉంటుంది. కానీ రైతుల నుండి వసూలు చేసిన కౌలు డబ్బులు ఎక్కడ జమ అవుతున్నాయో ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి ఎకరాకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు కౌలు డబ్బులను రైతుల నుండి వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ సిబ్బందితో కుమ్మక్కయిన రైతులు ఆలయ భూములను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

కౌలుకు తీసుకున్న రైతులు ఆక్రమిస్తున్నారా సిబ్బందితో కుమ్మక్కైన రైతులు ఆక్రమిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 90 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు పక్కాగా సర్వే చేసి తమకు అప్పగించాలని దేవాదాయ శాఖ సిబ్బంది రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులేమో కౌలుకు ఇచ్చారు అంటారు . గ్రామస్తులు ఏమో ఆక్రమణకు గురవుతున్నాయని అంటారు. రైతుల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ జమ అవుతున్నాయి అనే విషయం తేలాల్సి ఉంది . రెవిన్యూ అధికారులు పక్కాగా సర్వే చేసి ఈ భూములు ఆక్రమించిన రైతుల పై చర్యలు తీసుకోవాలని ఆలయ భూములను పరిరక్షించాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed