వీవీఐపీల రక్షణ కోసం ‘ఎయిర్ ఇండియా వన్’

by Sujitha Rachapalli |   ( Updated:2020-10-03 02:06:00.0  )
వీవీఐపీల రక్షణ కోసం ‘ఎయిర్ ఇండియా వన్’
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు గత ఎన్నికల టైమ్‌లో తన కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని తయారు చేయించుకున్నాడు. దాని పేరు ‘ట్రంప్ ఫోర్స్ వన్’. ఇదేగాక అగ్రరాజ్య ప్రెసిడెంట్‌‌కు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ అనే ప్రత్యేక విమానం కూడా ఉంది. ఆ తరహాలోనే.. భారత రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతులు, ఇతర వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ‘బోయింగ్ 777-300ఈఆర్’ అనే రెండు విమానాల్లో అత్యాధునిక సదుపాయలు, రక్షణ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం వాటిని డల్లాస్‌లోని బోయింగ్ సంస్థకు పంపించింది. అందులో ఓ విమానం తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. రెండో విమానం మరో వారంలో రాబోతుంది. అయితే, ‘ఎయిర్ ఇండియా వన్‌’గా పిలుస్తున్న ఆ సూపర్ స్పెషాలిటి విమాన ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

ఇండియాలోని వీవీఐపీల కోసమే అధునాతన సాంకేతికతను ఉపయోగించి ‘ఎయిర్ ఇండియా వన్’ విమానాలను ప్రత్యేక ఫీచర్లతో తయారు చేయించారు. ఇందులో వీవీఐపీ సూట్, రెండు కాన్ఫరెన్స్ రూములు, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్, మెడికల్, సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్ రూమ్స్ ఉంటాయి. క్షిపణి దాడుల్ని సైతం తట్టుకోగలిగే ఈ విమానంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ కూడా ఉన్నాయి. ఇందులో అమర్చిన రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చేయగల జామర్లు.. శత్రువుల క్షిపణులను దారి మళ్లించగలవు. అంతేకాదు ఇవి గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు (ఎయిర్ టూ ఎయిర్ రిఫ్యూయిల్ సిస్టమ్). గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలగే ఈ విమానం.. ఆగకుండా 17గంటల పాటు ప్రయాణించగలదు. మార్గ మధ్యలో కూడా ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్‌ పనిచేస్తుంది. కాగా ఈ విమానాల నిర్వహణ బాధ్యతలను ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) చూస్తుంది.

రక్షణ కోసం మిసైల్ వార్నింగ్ సెన్సార్స్, గార్డియన్ లేసర్ ట్రాన్స్‌మీటర్ అసెంబ్లీస్, అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్సివ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్స్ అమర్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన పైలట్లు మాత్రమే దీన్ని నడుపుతారు. ఇక విమానం మీద ఇండియా, భారత్ అని రాసి ఉండటంతో పాటు జాతీయ జెండా, అశోక ఎంబ్లమ్ చిహ్నాలు కూడా ముద్రించి ఉన్నాయి.

Advertisement

Next Story