- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైళ్లకైతే మేం అడ్డం లేము కదా.. మరీ, మమ్మల్నెందుకు పొమ్మంటున్రు?
దిశ, న్యూస్‌బ్యూరో: ‘మన చరిత్ర, వారసత్వ సంపదను మనమే కాపాడుకోవాలి. నగరంలో అపూర్వ కట్టడాలు, వారసత్వ సంపద ఉంది. అందులో సుల్తాన్ బజార్ మార్కెట్ ఒకటి. మెట్రో కోసం ఆ చరిత్రను నేలమట్టం చేస్తారా..? రెండొందల ఏండ్ల చరిత్ర కలిగిన వారసత్వ మార్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం కానివ్వం. మెట్రో అలైన్‌మెంట్ మార్చాల్సిందే.. సుల్తాన్ బజార్‌ను కాపాడేందుకు పెద్ద ఉద్యమం చేసైనా సరే వీధి వ్యాపారులకు అండగా నిలబడతాం..’ అని 2011 జూన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో తమ కష్టాలు తీరిపోతాయనుకున్న సుల్తాన్ బజార్ వ్యాపారులకు నేడు ఉపాధి కూడా కరువై కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్రోను అడ్డుకుంటామన్న కేసీఆరే స్వయంగా వచ్చి సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లే జేబీఎస్-ఎంజీబీఎస్ రైల్వే లైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధికి తాము అడ్డుకాదని.. తమ పొట్ట కొట్టి అన్యాయం చేయొద్దంటున్న సుల్తాన్ బజార్ దుకాణదారులను పట్టించుకునే నాథుడే లేడు. అటు మెట్రో, ఇటు ప్రభుత్వం వారి ఆర్తనాదాలను వినేందుకు కూడా సిద్ధంగా లేదని వారు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని సుల్తాన్ బజార్ గల్లీలో మెట్రో నిర్మాణ పనులు వేగంగా చేపట్టారని ఆరోపిస్తున్నారు.
నిజాం కాలం నాటి చరిత్ర కలిగిన సుల్తాన్‌బజార్ లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లలో సుల్తాన్ బజార్ మొదటిది. మెట్రో రైల్ రాకతో దీని చరిత్ర, ఇక్కడివారి జీవితాలు ఒకేసారి ముగింపు దశకు చేరుకుంటున్నాయి. వీధి వ్యాపారులకు ఉపాధి కల్పిస్తామని నిర్మాణ సమయంలో హామీనిచ్చినా ఇప్పుడు వారితో మాట్లాడేవారు కూడా కరువయ్యారు. దాదాపు 300 మంది రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా వ్యాపారం నడవని తమకు ఇప్పుడు గల్లీలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో కారిడార్‌లో వీధి వ్యాపారుల కోసం చిన్న మడిగెలు కట్టించినా.. వీరికి అందులో స్థానం కల్పించడం లేదు. 30 ఏండ్ల నుంచి ఇక్కడే వ్యాపారాలు చేస్తున్న తమను అనర్హులుగా ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తోపుడు బండ్లు, ఫుట్‌పాత్, చేతుల మీద వస్తువులను అమ్ముకుంటూ తిరిగే తమను ఇక్కడి నుంచి తరిమేసేందుకు ప్రభుత్వం, మెట్రో కలిసి కుట్ర చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. లాక్‌డౌన్‌లో తాము ఎవరులేని సమయంలో మెట్రో కింద సిమెంట్ రోడ్లు వేయడం, తాము బండ్లు పెట్టుకోకుండా డివైడర్లు నిర్మించడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందంటున్నారు. వీధిలో రెండు వైపులా ఉన్న పెద్దపెద్ద వ్యాపారులు వారి షాపులు ముందు నిల్చొని కూడా వస్తువులను అమ్ముకోనివ్వడం లేదని, మెట్రో నిర్మించిన మడిగెల్లో స్థలం కేటాయించని వారు వ్యాపారం చేసేందుకు వీలు లేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ పోలీసులు చిరు వ్యాపారులపై కేసులు పెడుతున్నారని ఏఐటీయూసీ చైర్మన్ లక్ష్మణ్ చెబుతున్నారు. ఏండ్ల నుంచి వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని ఉన్నపళంగా వెళ్లిపొమ్మంటే ఎలా బతకాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.
లాక్‌డౌన్‌లో మెట్రో అత్యుత్సాహం
మెట్రో రైల్ అధికారులు కొత్తగా నిర్మించిన స్థలంలో సుమారు 160 మందికి మాత్రమే మడిగెలు కేటాయించారు. సుల్తాన్ బజార్‌లో ఉండే పెద్ద వ్యాపారులకు మాత్రమే ఇందులో స్థానం కల్పించారని వీధి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తమను గుర్తిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) ఏండ్ల క్రితమే గుర్తింపు కార్డులు జారీ చేసిందని అయినా తమకు ఎలాంటి సాయం మెట్రో అందించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. వీధి వ్యాపారుల కోసం చేపట్టిన నిర్మాణాలను ముందుగా టౌన్ వెండర్స్ కమిటీ(టీవీసీ) సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యలో టీవీసీ సమావేశమే నిర్వహించలేదు. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, పోలీస్, వీధి వ్యాపారులు అందరూ ఉండే టీవీసీ ఆమోదం లేకుండానే మెట్రో పిల్లర్ల మధ్య మడిగెలు నిర్మించారు. వీధి వ్యాపారులు ఎవరూ లేని సమయం చూసి మెట్రో నిర్మాణాలు పూర్తి చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డులు కలిగిన తమను కాదని ఎవరికో మడిగెలు ఎలా కేటాయిస్తారని అడిగినా సమాధనం చెప్పేవారు లేరు. సుల్తాన్ బజార్‌కు చెందిన ఒక బడా వ్యాపారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న మెట్రో స్ట్రక్చరల్ విభాగం ఆయన చెప్పినట్టే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మెట్రో అధికారులు సైతం సదరు వ్యాపారి చెప్పిన వారందరికీ మడిగెలు కేటాయించామని, ఇప్పుడు ఆందోళన చేస్తున్నవారితో తమకు సంబంధం లేదని అధికారికంగా ఒప్పుకోవడం గమనార్హం.
ఎలా బతకాలె.. ఎక్కడకు పోవాలె..? : అబ్దుల్ హమీద్, వీధి వ్యాపారి
జడ క్లిప్పులు, రిబ్బన్లు, బొట్టుబిళ్లలు వంటి ఫ్యాన్సీ వస్తువులను అమ్ముకుంటున్నా. చేతిలోనే వస్తువులను వేసుకొని గల్లీలో అటూ ఇటూ తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నా. సుల్తాన్‌బజార్‌లో 23 ఏండ్ల నుంచి ఇదే మార్కెట్‌లో పనిచేస్తున్నా. మెహిదీపట్నం నుంచి వచ్చి దందా చేసుకుని రోజుకు 300 నుంచి 500 వరకూ సంపాదిస్తున్నా. భార్య, నలుగురు పిల్లలు, అమ్మా- నాన్న అందరికీ ఈ వ్యాపారమే దిక్కు. గవర్నమెంట్ గుర్తింపు కార్డు కూడా ఇచ్చింది. ఇప్పుడేమో మీరు ఇక్కడ వస్తువులు అమ్ముకోవద్దంటే ఎలా బతకాలె. ఎక్కడకు పోవాలే.. మెట్రో కట్టేటపుడు మాకు కూడా ఇస్తమన్నరు. ఇప్పుడు దిక్కున్నచోట చెప్పుకో అంటున్నరు. ఇక్కడ నుంచి వెళ్లిపోతే చావు తప్ప మాకు ఇంకేం లేదు.
కేసులు పెట్టి సతాయిస్తున్నరు: కిశోర్, తోపుడు బండి వ్యాపారి
30 ఏండ్ల నుంచి సుల్తాన్ బజార్‌లోనే వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు ఇది తప్ప ఇంకేం పనిరాదు.. మెట్రో రైల్ వేయొద్దని మేం అంటలేము. మమ్మల్ని కూడా బతకనియ్యాలి కదా.. ఈ గల్లీకి వందల ఏండ్ల చరిత్ర ఉంది. మేం ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నం. ఈ స్థలం మా తల్లి లెక్క అన్నం పెడుతోంది. ఇప్పుడొచ్చి మీరందరూ ఖాళీ చేయాలంటే ఏమన్నట్టు. రైళ్లకైతే మేం అడ్డం లేము కదా.. గల్లీలో మా దందా ఏదో మేము చేసుకుని బతుకుతున్నాం.. మమ్మల్ని బతకనియ్యిర్రి.. ఎట్లయిన మమ్మల్ని ఖాళీ చేయించాలని పోలీసోళ్లతో రోజూ చలాన్ రాయిస్తున్నరు.. కేసులు రాస్తున్నరు. మెట్రో పనులు పూర్తయినంక కనిపిస్తే జైలులో వేస్తామని పోలీసులు బెదిరిస్తున్నరు..