- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతాలు రావు.. ఖర్చులు చేయాల్సిందే
-ఉపాధి కోల్పోయిన చిరు ఉద్యోగులు, కూలీలు
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కాలంలో వేతనాలు చెల్లించాల్సిందేననీ, ఇంటి అద్దెలు అడిగి వారిని ఇబ్బందులు పెట్టొద్దని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాని ప్రభుత్వ అధికారులకే జీతాలు కట్ చేశారు. ప్రైవేటు కంపెనీలైన మేము ఇప్పుడు జీతం ఎలా ఇస్తామని ఆ కంపెనీల యజమానులు ప్రశ్నిస్తే ఉద్యోగుల వద్ద సమాధానం లేకుండా పోయింది. అద్దె చెల్లించకపోతే ఇంట్లో నుంచి ఖాళీ చేయక తప్పని పరిస్థితుల్లో మధ్య తరగతి జీవులు అవస్థలు పడుతున్నారు.
లాక్‌డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్ సిటీలోని పలు ప్రైవేటు కంపెనీలు, సంస్థలు ఆఫీసులకు తాళాలు వేశాయి. ఏప్రిల్ నెల మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతుందనే అంచనాలతో ఉన్నాయి. ప్రస్తుత కాలానికి జీతం అడిగే అవకాశం లేదు. కనీసం మార్చి నెల జీతం ఇవ్వాలన్నా ఇవ్వడం లేదు. చివరి వారం రోజులు జీతం ఎలాగో రాదు. ఎవరైనా నోరు తెరిచి జీతం కావాలని అడిగినా.. యాజమాన్యాలు జీతాలివ్వలేమని నేరుగానే చెప్పేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను జూన్ 3 వరకూ కొనసాగించాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో అంతవరకూ కొనసాగితే తమ సంస్థలను ఎలా కొనసాగించాలనే ఆలోచనలతో యాజమాన్యాలు చేతులోని డబ్బులను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. మార్చి నెలలో నగరాన్ని విడిచి చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. అయితే, ఇంటి అద్దెలు చెల్లించడం మాత్రం తప్పడం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వం రెంట్ గురించి ఇబ్బంది పెట్టొద్దని చెప్తే వాళ్లు కొత్త ఇల్లు వెతుక్కోక తప్పదు.
వరంగల్ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ ఉప్పల్‌లో అద్దెకుంటూ తార్నాకలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. నెలకు రూ.12వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లాక్‌డౌన్ ప్రకటనతో కుటుంబంతో సహా సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి ఓనర్ ప్రతి రోజూ రెంట్ కోసం రాజ్‌కుమార్‌కు పోన్ చేస్తున్నాడు. ఏదో ఒక కారణం చెప్పి రేపు, మాపు అంటూ వాయిదా వేసుకొస్తున్నాడు రాజ్‌కుమార్. పనిచేసే దుకాణంలో మార్చి నెల జీతమే ఇంకా ఇవ్వలేదు. వాళ్లకు ఫోన్ చేస్తే లాక్‌డౌన్ పూర్తయ్యాక, తను తిరిగొచ్చాక చూద్దామని సమాధానం చెబుతున్నారు. అప్పటివరకూ ఆగమంటే ఇంటి యజమాని వినేలా లేడు. అద్దె చెల్లించాల్సిన అవసరం లేదనీ, లాక్‌డౌన్ ముగిసే వరకూ ఆగాలని ముఖ్యమంత్రి చెప్పారు కదా అని రాజ్‌కుమార్‌తో ప్రస్తావించగా.. మీరన్నది నిజమే కాని అలా చెబితే ఓనర్లు ఒప్పుకుంటారా మీరే చెప్పండి. ఇబ్బందులు ఉన్నాయని అందరికీ తెలుసు. అయినా ఆగరు కదా.. మనం చెప్పామనుకోండి.. అయితే మీరు కొత్త ఇల్లు చూసుకోండి అని చెప్పేస్తారు. సిటీలో ఇల్లు దొరకడం, మారడం ఎంత కష్టమో మీకు తెలియదా.. ఏదో ఒకటి చెప్పుకుంటూ ఇలా నెట్టుకురావడమే కాని చేయగలిగిందేమీ లేదని రాజ్‌కుమార్ వాపోయారు.
నిజామాబాద్‌కు చెందిన విజయ్ నగరంలోని ఓ రాజకీయ నాయకుడి వద్ద కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.20 వేల జీతంలో ప్రతి నెలా రూ.5 వేలు చిట్టీ కడుతుంటాడు. మిగిలిన వాటిలో రూం అద్దె, కుటుంబ అవసరాలు తీర్చుకుంటుంటారు. ఇప్పుడు ఆ నాయకుడి డ్యూటీకి పిలవడం లేదు. లాక్‌డౌన్‌తో కారు ఎక్కడికి వెళ్లేది లేదు. పోయిన నెలలోనే ఏదైనా అవసరమొస్తుందని ఊహించి కార్‌లో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాడు. కాని నెల పూర్తవ్వందే జీతం ఇవ్వరు కదా.. మార్చి నెలకు సంబంధించి వారం రోజులు పోనూ మిగిలిన జీతం ఇస్తున్నాడు. ఏప్రిల్ నెల వచ్చేదేమీ లేదు. జూన్ వరకు పొడగిస్తే ఇంక చెప్పలేము.. జీతం రావడం లేదు కదా అంటే చిట్టీ కట్టక తప్పదు కదా.. ఊర్లో అందరి ముందు అడుగుతారు.. ఎత్తుకున్న చిట్టీ కట్టకపోతే ఎట్ల ఉంటది చెప్పండనేది విజయ్ వాదన. వచ్చే జీతమేమీ లేదు కానీ రెంట్, చిట్టీలు, కూరగాయాల ఖర్చులు అన్ని తప్పవు. వీటికి అప్పులు తేవాలన్న ఇచ్చేవారు లేరు.
కరోనా వైరస్ వచ్చే అనారోగ్యం ఏమో గానీ అది మధ్య తరగతి, కష్ట జీవులకు తెచ్చిన తంటాలు అంతా ఇంతా కాదు. పెద్ద సంస్థలే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. జీతం చెల్లించడం లేదు. సొంతంగా వ్యాపారులు పెట్టుకున్న వారు జీతాలు ఎందుకు ఇస్తారు. ముఖ్యంగా అసిస్టెంట్లు, డ్రైవర్లు, హెల్పర్ పనులు చేసేవారికి పని చేసిన రోజే జీతం లెక్కిస్తారు. దుకాణాలు నడవకున్నా జీతాలు ఇచ్చేందుకు ఆర్థిక వనరులు అంతగా ఉండవు. పనికి పోని రోజు జీతమెలా అడుగుతామన్నది పనిచేసే వారి వాదన. కాని యజమాని నెట్టుకురాగలిగిన సమయంలో వారి కింద పనిచేసే వారికి వచ్చే జీతమే కుటుంబాన్ని నడిపిస్తుంది. అదిప్పుడు రావడం లేదు. కుటుంబ పోషణ, ఇతర చెల్లింపులు మాత్రం తప్పడం లేదు. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
Tags: Telangana, kcr, lockdown, salary, house rent, trouble, small, employee