- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీదిరి అప్పలరాజుకు ఝలకిచ్చిన సొంత పార్టీ నేతలు
దిశ, ఏపీ బ్యూరో: రాజకీయ అండ ఉంటే చాలు.. ఏదైనా సాధించేయవచ్చనే తీరులో ఉంది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ. ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక మంత్రి అయ్యారంటే ఆయన పవర్ ఎలా ఉపయోగిస్తారో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తన మాట వినని అధికారులను బదిలీ చేయించిన ఘటనలు అనేకం చూశాం. ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
జిల్లాకు చెందిన ఓ మంత్రి తన మాట వినని జేసీని బదిలీ చేయించారు. తాను ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఆ అధికారికి ప్రజల్లో మంచి పేరుంది. అంతేకాదు రాజకీయ నాయకుల వద్ద మంచి గుర్తింపు ఉంది. విధి నిర్వహణలో ఎంతో ఖచ్చితంగా ఉంటూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ నిత్యం ప్రజాసేవలో తరించే ఆ అధికారిని ప్రజలు వదులుకోలేకపోయారు. ఆయన బదిలీపై వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు కంటతడి పెట్టారంటే ఆ అధికారి చేసిన సేవ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మంచి పనితనం కలిగిన అధికారిని కోల్పోవడం ఆ జిల్లాలోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు తట్టుకోలేకపోయారు. అంతే పై స్థాయిలో చక్రం తిప్పి తిరిగి ఆ జేసీని జిల్లాకు రప్పించుకున్నారు. ఇప్పుడు ఈ వార్త శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా జేసీగా సుమిత్ కుమార్ పనిచేశారు. ప్రాణాలు హరించే కరోనాలాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు సేవలో తరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సాయం చేసేవారు. అంతేకాదు. కరోనా వచ్చిన వారు వైద్యం కోసం పడుతున్న బాధలను కళ్లారా చూసిన సుమిత్‌కుమార్ కరోనా రోగుల సంరక్షణే లక్ష్యంగా పనిచేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిరంతరం ప్రజల్లోనే ఉండేవారు. అర్థరాత్రి ఫోన్ చేసినా వెంటనే స్పందించేవారు. ఫోన్‌లో చిన్న మెసేజ్ పెట్టి తమ ఆవేదన వెళ్లగక్కినా వెంటనే వారికి న్యాయం చేసే వరకు నిద్రపోలేదని జిల్లా ప్రజలు చెప్తున్నారు.
అయితే ఈనెల 24న జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా సుమిత్‌కుమార్‌పై కూడా బదిలీ వేటు వేశారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సీఎంవోతో సంప్రదింపులు జరిపారు. హుటాహుటిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అమరావతికి బయలుదేరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన జేసీని బదిలీ చేస్తున్నప్పుడు కనీసం తనను సంప్రదించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కీలకమైన రెవెన్యూ శాఖకు తాను మంత్రిగా ఉన్నానన్న విషయం కూడా మరచిపోయారా అని ప్రశ్నించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సుమిత్‌కుమార్ బదిలీని నిలిపివేయాలని కోరారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. సుమిత్‌కుమార్‌ను తిరిగి శ్రీకాకుళం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సుమిత్ కుమార్ పలాస రెవెన్యూ భూముల అన్యాక్రాంతం విషయంలో చాలా నిబద్ధతతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. భూముల అన్యాక్రాంతంలో జేసీ వెనక్కుతగ్గకపోవడం కొంతమంది ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు. అలాగే ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధిలో కూడా జేసీ సుమిత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ ఇన్‌చార్జ్ పిరియా సాయిరాజ్‌తో కలిసి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించారు. ఈ విషయాల్లో మంత్రి సీదిరి అప్పలరాజుకు జేసీ సుమిత్‌కుమార్‌కు మధ్య విభేదాలకు కారణమయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజు సుమిత్‌కుమార్‌పై బదిలీకి చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి సీదిరి అప్పలరాజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. కాగా, సుమిత్‌కుమార్ తిరిగి రావడంపట్ల ప్రజాప్రతినిధులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమిత్‌కుమార్ బదిలీ విషయంలో జరిగిన రాజకీయం ఆయన నిబద్దత ముందు ఓడిపోయిందని పలువురు చెబుతున్నారు.