ఆస్ట్రేలియా పర్యటన రద్దు కానుందా ?

by Shyam |
ఆస్ట్రేలియా పర్యటన రద్దు కానుందా ?
X

కరోనా మహమ్మారి క్రికెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే ఇండియా-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ సిరీస్‌లు అర్థాంతరంగా రద్దయ్యాయి. ఐపీఎల్ రద్దు వార్త ప్రకటించకపోయినా.. ఇప్పట్లో ఆ లీగ్ జరుగుతుందనే ఆశలైతే లేవు. ఈ నేపథ్యంలో కీలకమైన ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ రద్దువుతుందనే వార్తలు వెలువడుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. రాబోయే 6 నెలల పాటు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. విదేశీయులెవరూ దేశంలోకి అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల తర్వాత కరోనా ప్రభావం తగ్గకుంటే ఈ నిబంధనలు మరింత కాలం పొడిగిస్తామని చెబుతోంది. దీంతో భారత జట్టు పర్యటన డైలమాలో పడింది.

షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో ఆ టోర్నీ షెడ్యూల్‌పై ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా చర్చలు జరుపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ కంటే ముందే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియా వీసా నిబంధనలతో ఇప్పుడు ఈ సిరీస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ పరిణామాలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆస్ట్రేలియా వీసా నిబంధనలను గమనిస్తున్నామని.. కానీ ఆరు నెలల సమయం ఉన్నందున, ఇప్పుడే ఆ విషయం మాట్లాడటం సరైంది కాదని ఆయన అన్నారు. కరోనా ప్రభావం అక్కడ తగ్గిపోతే ఆస్ట్రేలియా నిబంధనలు సడలించే అవకాశం ఉందని సదరు అధికారి అభిప్రాయపడ్డాడు.

Tags : Australia Tour, Team India, October, Visa cancellation, BCCI, Corona

Advertisement

Next Story

Most Viewed