మహిళ ఫోటోలతో గూగుల్ డూడుల్.. ఎవరీ షిర్లే టెంపుల్.?

by vinod kumar |   ( Updated:2021-06-09 01:16:10.0  )
మహిళ ఫోటోలతో గూగుల్ డూడుల్.. ఎవరీ షిర్లే టెంపుల్.?
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాకు చెందిన ప్రముఖ నటి, సింగర్, డ్యాన్సర్ అయిన షిర్లే టెంపుల్‌కు గూగుల్ డూడుల్ నివాళులు అర్పించింది. టీనేజ్‌లోనే హాలీవుడ్‌లో మంచి నటిగా, డ్యాన్సర్, సింగర్‌గా రాణించి యంగ్ పర్మఫార్మర్‌గా అనేక అవార్డులు సొంతం చేసుకున్న షిర్లే టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటా మొనికలో 1928, ఏప్రిల్ 23న షిర్లే టెంపుల్ జన్మించారు. మూడేళ్ల వయస్సున్నప్పుడు డ్యాన్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టిన షిర్లే టెంపుల్.. ఆరేళ్ల వయస్సులోనే అమెరికా మెచ్చిన యంగ్ డ్యాన్సర్ అనిపించుకున్నారు. అప్పటికే(ఆరేళ్ల వయస్సు) డజన్‌కు పైగా సినిమాల్లో నటించి బాల నటిగా షిర్లే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే.. చిన్న వయస్సులోనే హాలీవుడ్‌లో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న షిర్లే టెంపుల్ 22 ఏళ్ల ప్రాయంలోనే హాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేశారు. అనంతరం ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి ఆందోళన చెందుతున్న సమయంలో షిర్లే టెంపుల్ అమెరికా తరఫున 1969లో ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. పర్యావరణానికి రాబోయే ముప్పును ముందే గ్రహించి 1972లో జరిగిన ఓ సదస్సులో తన వాదనలు వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇలా ఎన్నో విజయాలు, మన్ననలు అందుకున్న షిర్లే టెంపుల్ 2014 ఫిబ్రవరి 10వ తేదీన క్యాలిఫోర్నియాలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె జీవితంలో సాధించిన విజయాలకు జ్ఞాపకార్థంగా శాంటా మొనిక హిస్టరీ మ్యూజియం వాళ్లు 2015వ సంవత్సరం జూన్ 9వ తేదీన లవ్ షిర్లే టెంపుల్ పేరుతో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌లో ఆమె సాధించిన ఘనతలు, విజయాల గురించి ముందు తరాలకు గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే నేటి ఎగ్జిబిషన్ ప్రారంభించి ఆరేళ్లు గడిచిన సందర్భంగా గూగుల్ డూడుల్ ఆమెకు నివాళులు అర్పించింది.

Advertisement

Next Story

Most Viewed