హాట్ టాపిక్‌గా  ఎన్నికల సర్వే.. గెలుపెవరిదో ?

by Shyam |   ( Updated:2021-09-30 03:41:35.0  )
హాట్ టాపిక్‌గా  ఎన్నికల సర్వే.. గెలుపెవరిదో ?
X

దిశ, శేరిలింగంపల్లి : సార్ మీరు ఏపార్టీకి ఓటేస్తారు.? ఎవరు గెలిస్తే బాగుంటుంది..? శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏ నాయకుడు గెలుస్తారు..? టీఆర్ ఎస్, బీజేపీ, టీడీపీలో ఎవరికి అవకాశం ఉంది..? ఏంటీ ఇదంతా.. ఇన్ని ప్రశ్నలు ఎందుకు అన్న సందేహాలు అందరిలోనూ మెదులుతుంటాయి. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చాలామందికి వస్తున్న ఫోన్ కాల్స్ ఇవే. అందరికీ ఇవే క్వశ్చన్స్. ఎందుకీ ఫోన్ కాల్స్..? ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంటే ఇప్పటి నుండి ఈ హడావుడి ఏంటన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

రెండేళ్ల ముందుగానే ఎలక్షన్స్ సర్వే..?

ఇది ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నప్పటికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ తరహా ఫోన్ కాల్స్ సర్వ సాధారణంగా మారాయి. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు సర్వేలు చేయడం గమనార్హం. ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు అనే విషయం పక్కన పెడితే.. ఈ సర్వేలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా..? అన్న సందేహాలు మాత్రం అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే సర్వేలు చేయిస్తున్నారన్న చర్చ సాగుతోంది.

పార్టీ సర్వేలా..? పర్సనల్ సర్వేలా..?

రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఈ సర్వేల హడావుడి జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే సర్వేలు చేయిస్తుంది ఆయా పార్టీలా.. అధిష్టానాల, లేదా నియోజకవర్గ నాయకులా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ పార్టీలు చేయిస్తే కేవలం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు చేయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేయించాలి. కానీ, కేవలం ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదో ఒక పార్టీకి చెందిన నాయకుడు, లేదా టికెట్ ఆశిస్తున్న వ్యక్తి ఈ సర్వే చేయిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.

అభ్యర్థులు వీరేనా..

తాజాగా నిర్వహిస్తున్న సర్వే ప్రకారం టీఆర్ ఎస్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, బీజేపీ నుండి మారబోయిన రవికుమార్ యాదవ్, టీడీపీ నుండి బి. ఆనంద్ ప్రసాద్‌ల పేర్లు ప్రస్తావిస్తున్నారు సర్వే కోసం కాల్స్ చేస్తున్న వ్యక్తులు. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేస్తారు. ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి చేశారా..? రవికుమార్ యాదవ్ యూత్ కదా ఆయనకు అవకాశం వస్తే ఎలా ఉంటుంది. టీడీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందా అంటూ పరిపరి విధాలా ప్రశ్నలు వేస్తున్నారు సర్వే చేస్తున్న ప్రతినిధులు. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ పేరుకానీ, అభ్యర్ధి ఎవరూ అన్నదానిపై ఒక్క ప్రశ్న కూడా అడగక పోవడం విశేషం. అసలు వారిని లెక్కలోకి కూడ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి సుమారు రెండేళ్ల ముందే సర్వే రిపోర్టులు రెడీ చేస్తుండడం దేనికి సంకేతమో అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed