వారాంతం మార్కెట్లకు భారీ లాభాలు!

by Harish |   ( Updated:2021-05-21 06:46:25.0  )
వారాంతం మార్కెట్లకు భారీ లాభాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ లాభాలు సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కరోనా మహమ్మారి నియంత్రణలోకి వస్తున్న వార్తలతో సూచీలు పుంజుకున్నాయి. అంతేకాకుండా ఆర్థికవ్యవస్థ బలంగా కోలుకుంటుందనే ఆశల మధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. వీటితో పాటు మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో కంపెనీల ఆదాయాలు మార్కెట్లలో సానుకూలతను పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ కేంద్రానికి భారీగా నిధులను కేటాయించడం, దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రికార్డు స్థాయిలో త్రైమాసిక లాభాలను వెల్లడించడం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్ల లాభాలకు దోహదపడ్డాయని ఎల్‌కేపీ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ అన్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 975.62 పాయింట్లు ఎగసి 50,540 వద్ద ముగియగా, నిఫ్టీ 269.25 పాయింట్లు పుంజుకుని 15,175 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా పుంజుకోగా, మిగిలిన అన్ని రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.80 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed