ఆ అండతో… భారీగా లాభపడిన మార్కెట్లు!

by Harish |
ఆ అండతో… భారీగా లాభపడిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండతో మార్కెట్లు జోరందుకున్నాయి. బుధవారం నాటి నష్టాలను అధిగమిస్తూ అమెరికా మార్కెట్లు పుంజుకోవడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా రిలయన్స్ సంస్థ మార్కెట్ల లాభాలకు అండగా నిలిచాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

వరుస సెషన్లలో ఊగిసలాటను చూసిన సూచీలు గురువారం ఉదయం నుంచే లాభాలను దక్కించుకున్నాయి. ఇన్వెస్టర్లు అత్యధికంగా కొనుగోళ్లకు సిద్ధపడటంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 646.40 పాయింట్లు ఎగిసి 38,840 వద్ద ముగియగా, నిఫ్టీ 171.25 పాయింట్లు లాభపడి 11,449 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు బలపడగా, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటో, మీడియా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు డీలాపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ రికార్డు స్థాయిలో 7 శాతానికి పైగా పుంజుకోగా, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ షేర్లు లాభపడగా, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Advertisement

Next Story