రికార్డులతో చరిత్ర సృష్టించిన నిఫ్టీ

by Harish |   ( Updated:2021-08-03 21:11:59.0  )
sensex 1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అద్భుతమైన ర్యాలీతో జీవితకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు దూసుకెళ్లగా చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 16 వేల మార్కును చేరుకుని చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ పూర్తిస్థాయిలో సానుకూలంగా ఉండటంతో నిఫ్టీతో పాటు బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 800 పాయింట్లకు ఎగసి జీవితకాల గరిష్ఠాల వద్ద ట్రేడయ్యాయి. అన్ని రకాలుగా కలిసిరావడంతో స్టాక్ మార్కెట్లు ప్రస్తుత ఏడాదిలోనే సింగిల్ డే బిగ్గెస్ట్ గెయిన్‌గా నిలిచాయి. ఆర్థికవ్యవస్థలో డిమాండ్ పునరుజ్జీవనం వైపుగా పయనిస్తున్నట్టు వివిధ ఆర్థిక సూచీలు సంకేతాలివ్వడంతో, ఆర్థిక పునరుద్ధరణ వేగవంతంగా ఉంటుందనే ఆశతో స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 872.73 పాయింట్లు ర్యాలీ చేసి 53,823 వద్ద క్లోజయింది.

నిఫ్టీ రికార్డు స్థాయిలో 245.60 పాయింట్లు ఎగసి 16,130 జీవితకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ 16 వేల మార్కును దాటి గరిష్ఠాల వద్ద ట్రేడయ్యాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2 శాతంతో అధిక లాభాలను సాధించగా, మిగిలిన అన్ని రంగాలు సైతం కొనుగోళ్ల జోరును కొనసాగించాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు 1.5 శాతం వరకు పుంజుకున్నాయి. మీడియా, మెటల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలు సాధించాయి. ముఖ్యంగా టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed