వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Harish |   ( Updated:2021-07-29 05:54:51.0  )
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఐటీ, మెటల్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి. ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లు లాభాలతో ర్యాలీ చేశాయి. మిడ్ సెషన్ సమయంలో పలు రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురైనప్పటికీ అనంతరం కీలక రంగాల మద్దతుతో మెరుగైన లాభాలను సాధించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి 209.36 పాయింట్లు ఎగసి 52,653 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 69.05 పాయింట్లు లాభపడి 15,778 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 5 శాతం పెరిగింది. చైనా ఎగుమతి సుంకాలను పెంచనున్నట్టు వచ్చిన నివేదికల వల్లే మెటల్ రంగాల్లో షేర్ల కోసం మదుపర్లు ఎగబడ్డారని నిపుణులు తెలిపారు. పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఐటీ రంగాలు 1-3 శాతం మధ్య పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో, ప్రైవేట్ బ్యాంకు రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టైటాన్ షేర్లు లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, ఐటీసీ, డా రెడ్డీస్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.28 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed