వరుస లాభాల్లో మార్కెట్లు

by Harish |
వరుస లాభాల్లో మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) వరుసగా నాలుగో రోజు అధిక లాభాలను నమోదు చేశాయి. బుధవారం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో కొంత ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ అనంతరం లాభాల జోరు కొనసాగించింది. మంగళవారం అమెరికా మార్కెట్ల పతనం కారణంగా ఉదయం ఒడిదుడుకులకు లోనయ్యాయని, మంగళవారం రాత్రి తర్వాత రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వార్తలు బుధవారం నాటి మార్కెట్లలో జోరు పెంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే, హెవీవెయిట్ షేర్లు పుంజుకోవడం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 304.38 పాయింట్లు ఎగసి 39,878 వద్ద ముగియగా, నిఫ్టీ 76.45 పాయింట్లు లాభపడి 11,738 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా ఆటో రంగం అత్యుత్తమ పనితీరు కనబరించింది. అలాగే, ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ రంగం షేర్లు సుమారు 1 శాతం వరకు పుంజుకున్నాయి, మెటల్, మీడియా, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా రంగాలు నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, రిలయన్స్, ఆల్ట్రా సిమెంట్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా, హిందూస్తా యూనిలీవర్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.33 వద్ద ఉంది.

Advertisement

Next Story