వరుస లాభాలకు బ్రేక్

by Harish |
వరుస లాభాలకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస రికార్డులతో దూసుకెళ్లిన ఈక్విటీ మార్కెట్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. భారీ లాభాల నుంచి విరామం తీసుకుంటూ బుధవారం మార్కెట్లు భారీ నష్టాలను దక్కించుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో అటు సెన్సెక్స్ ఇండెక్స్, ఇటు నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేసిన తరుణంలో అమాంతం కుదేలయ్యాయి. దీంతో బుధవారం ఒక్కరోజులోనే మార్కెట్లు రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయింది. మదుపర్ల లాభాల స్వీకరణ కారణంగా మగళవారం నిఫ్టీ సాధించిన 13 వేల మార్కు తుడిచిపెట్టుకుపోయింది.

మునుపటి జోరును కొనసాగిస్తూ ఉదయం సూచీలు మరోసారి జీవితకాల గరిష్ఠాలను దక్కించుకున్నప్పటికీ అనంతరం అమ్మకాలు పెరగడంతో డీలాపడ్డాయి. మిడ్ సెషన్ సమయంలో అమ్మకాలు పెరగడంతో చివర్లో భారీ పతనం తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 694.92 పాయింట్లు కూలిపోయి 43,828 వద్ద ముగియగా, నిఫ్టీ 196.75 పాయింట్లు పడిపోయి 12,858 వద్ద ముగిసింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించడంతో మార్కెట్లు కుదేలయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 30 వేల మైలురాయితో రికార్డు నమోదు చేసింది. నిఫ్టీలో కీలక రంగాలన్నీ 1 శాతానికిపైగా నీరసించగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు 1 శాతంపైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని సూచీలు కుప్పకూలాయి. ముఖ్యంగా కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.92 వద్ద ఉంది.

Advertisement

Next Story