మళ్లీ నష్టాల్లోనే మార్కెట్లు

by Harish |
మళ్లీ నష్టాల్లోనే మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Domestic equity markets) వరుసగా మూడోరోజూ నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం కారణంగా సూచీలు మళ్లీ నష్టాల్లోనే కదలాడాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఉదయం లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ ప్రధాన షేర్ల అమ్మకాల ఒత్తిడి కారణంగా చివర్లో నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 135.78 పాయింట్లు కొల్పోయి 39,614 వద్ద ముగియగా, నిఫ్టీ 28.40 పాయింట్లు నష్టపోయి 11,642 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ రంగాలు 1 శాతానికి పైగా నీరసించగా, రియల్టీ 2 శాతం వరకు జంప్ చేసింది.

మీడియా, మెటల్, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లె ఇండియా, రిలయన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.56 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed