భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఎందుకంటే ?

by Harish |   ( Updated:2021-09-20 08:34:00.0  )
nifty
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గతవారం సాధించిన రికార్డు లాభాలను పోగొట్టుకున్నాయి. సోమవారం ఉదయం నుంచే నష్టాలతో మొదలైన సూచీలు ఓ దశలో లాభాల వైపునకు వెళ్లినప్పటికీ తిరిగి నష్టాల్లో కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారని, అంతేకాకుండా గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లు గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చైనాలో డిమాండ్ కుప్పకూలడంతో మెటల్ రంగంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇక, ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగిందని తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 524.94 పాయింట్లు కోల్పోయి 58,490 వద్ద పతనమవగా, నిఫ్టీ 188.25 పాయింట్లు నష్టపోయి 17,396 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 5 శాతానికి పైగా కుదేలవగా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, హెల్త్‌కేర్, ఫార్మా, ఫైనాన్స్ రంగాలు కుప్పకూలాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, డా రెడ్డీస్, ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.64 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed