- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభకు కేకే ఓకే… ఇంకొకరెవ్వరు?
దిశ, న్యూస్ బ్యూరో:
తెలంగాణ నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. రెండింటిలో ఒకటి సిట్టింగ్ ఎంపీ కేశవరావుకు ఖరారైంది. మరో అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తుండడంతో ఏ సమయంలో పార్టీ అధినేత నుంచి పిలుపు వస్తుందా అని వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. రెండోసీటు కోసం నలుగురైదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దామోదరరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల్లో ఒకరికి ఇచ్చే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. పార్టీ అధినేత మదిలో ఏముందో ఇంకా బైటకు రాలేదు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన నామినేషన్లను దాఖలు చేయడానికి తుదిగడువు కావడంతో నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి కేకేకు మాత్రం లైన్‌క్లియర్ చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలవడానికి వచ్చినప్పుడే కేకేకు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే నామినేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసే పని మొదలైంది. నామినేషన్ వేయడానికి పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ తీసుకోవడం అనివార్యం కావడంతో దాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నందున అందుబాటులో ఉండేందుకు కేకే ఢిల్లీకి వెళ్ళకుండా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏ టైమ్‌లో నామినేషన్ వేయాల్సి ఉంటుందో పార్టీ అధినేతగా కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడాన్ని బట్టి ఉంటుంది. దానికోసమే ఢిల్లీకి వెళ్ళకుండా హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాల్సి వచ్చింది.
రెండో అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో ఒకవైపు ఆశావహుల్లో ఉత్కంఠ, మరోవైపు ఆశలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇంతకాలం వినిపిస్తున్న దామోదర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లతో పాటు రెండు రోజులుగా కొత్త పేరు వినిపిస్తోంది. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి పేరు తాజాగా వినిపిస్తోంది. మొదటి రెండు పేర్లకు బదులుగా కేసీఆర్ మనసులో ఉన్న పార్థసారధిరెడ్డికే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలుత మైనారిటీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులను ప్రకటించడంపై పార్టీలో చర్చ జరిగినా రాజ్యసభ సభ్యుల విషయంలో లీగల్‌గా అలాంటివి విధిగా అమలుచేయాలన్న నిబంధన లేదని తేలడంతో కేసీఆర్ ఆ ఆలోచనకు స్వస్తి పలికినట్లు సమాచారం.
రాజ్యసభతో పాటే నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
రాష్ట్రం నుంచి ఎన్నిక కావాల్సి ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లతో పాటే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి పోటీచేసే అభ్యర్థి పేరును కూడా కేసీఆర్ ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఈగ గంగారెడ్డితో పాటు మైనారిటీ సెల్ నాయకుడైన ముజీబ్, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే శాసనమండలిలో ముగ్గురు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కాబట్టి ఈసారి కామారెడ్డి జిల్లాకు చెందినవారికి ఇవ్వాలన్న డిమాండ్ కూడా పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. రాజ్యసభకు పోటీచేసే ఇద్దరు అభ్యర్థులతో పాటే నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించాలన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Tags: Telangana, Rajyasabha, MLC, candidates, Keshavarao, Ponguleti, KTR, KCR, Hetero Drugs