రేపటితో ప్రచారానికి తెర

by Shyam |
రేపటితో ప్రచారానికి తెర
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. అలాగే అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన పలు మున్సిపాలిటీల్లోని 8 వార్డులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 18వ వార్డు లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ప్రచారానికి సైతం తెరపడనుంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోశాయి.

గెలుపే లక్ష్యంగా..

ఈ ఎన్నికల్లో పార్టీలు గెలుపే ధ్యేయంగా పోటాపోటీగా తలపడనున్నాయి. అధికార పార్టీ మరోసారి గెలుపుతో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు తీవ్రం చేసింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో గెలుపు, జీహెచ్ఎంసీలో తనదైన ముద్ర వేసిన బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ తరుపున ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే ప్రచారంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపారు. టీఆర్ఎస్ తరుపున వరంగల్ లో కేటీఆర్ పర్యటించి ప్రవేశపెట్టిన పథకాలను గురించి వివరించారు. మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారంతో హోరెత్తించారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పార్టీల మధ్య రాజకీయ విమర్శలు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఆయా పార్టీల నేతలు గెలుపు తమదేనంటూ ఎవరికి వారు కాలర్ ఎగురవేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తోంది. అయితే అధికార పార్టీలో రెబెల్స్ గుబులు పట్టుకోవడంతో ఇదే అదునుగా బీజేపీ గెలుపు జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది.

మాస్క్ ఉండాల్సిందే..

కొవిడ్ నిబంధనల వల్ల ప్రచారంపై ఎస్ఈసీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెలం 30న నిర్వహించనున్న పోలింగ్ లోనూ ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందికి కచ్చితంగా మాస్కులు, ఫేస్ షీల్డ్ అందించాలని అధికారులను ఆదేశించింది. ఓటర్లు కూడా తప్పనిసరిగా మాస్క్ వేసుకురావాలని, లేదంటే పోలింగ్ బూత్ లోకి వెళ్లనిచ్చేది లేదని ఎస్ఈసీ తేల్చేసింది. కొవిడ్ నియంత్రణకు వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటుచేయాలని ఆదేశించింది. అన్ని పోలింగ్ బూత్ ల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా మే 3న ఓట్లు లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. కాగా పోలింగ్ సిబ్బంది, రిజర్వ్ సిబ్బందికి అవసరమైన శిక్షణను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ భారీగా బందోబస్తు నిర్వహించేలా చేసుకోవాలని అధికారులకు సూచించింది.

Advertisement

Next Story