కరోనాతో పోరాటానికి ఎస్‌బీఐ రూ. 71 కోట్ల సాయం

by Harish |
కరోనాతో పోరాటానికి ఎస్‌బీఐ రూ. 71 కోట్ల సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మరితో పోరాడేందుకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వివిధ కార్యక్రమాల వినియోగానికి రూ. 71 కోట్ల సహాయాన్ని సోమవారం ప్రకటించింది. కరోనా బారిన పడిన వారికి తాత్కాలికంగా ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు, ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు బ్యాంకు వెల్లడించింది. తాత్కాలికంగా ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం కోసం బ్యాంకు అధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల వ్యయంతో 1,000 పడకల తాత్కాలిక ఆసుపత్రి, 250 ఐసీయూ బెడ్, 1,000 పడకలను కలిగిన ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఉపత్రులు, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వీటి ఏర్పాట్లు ఉండనున్నట్టు బ్యాంకు పేర్కొంది. అదేవిధంగా జీనోమ్ సీక్వెన్స్ పరికరాలతో పాటు వ్యాక్సిన్, ల్యాబ్ పరిశోధనా పరికారాల కోసం ప్రభుత్వానికి రూ. 10 కోట్లను ప్రభుత్వానికి ఎస్‌బీఐ అందించనుంది. అలాగే, ఎస్‌బీఐ తన 17 స్థానిక హెడ్ ఆఫీసులకు రూ. 21 కోట్లను కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిధులను ఉపయోగించి హెడ్ ఆఫీసులు ఉన్న ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాలను అందించనున్నట్టు తెలిపింది.

అదనంగా మరో రూ. 10 కోట్లు…

వీటితో పాటు కరోనా పరీక్షలు, ఇతర సహాయ కార్యక్రమాల కోసం అదనంగా రూ. 10 కోట్లను ఎస్‌బీఐ కేటాయించింది. పీపీఈ కిట్లు, మాస్కులు, ఆహారం, రేషన్ పంపిణీ కొనసాగించనున్నట్టు తెలిపింది. ‘కరోనాతో పోరాడేందుకు తమ వంతు సాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాము. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అందరూ ప్రభుత్వానికి మద్ధతుగా ఉండాలని, ప్రజలకు ఏదోక రూపంలో సాయం అందించడం అవసరం, దేశ పునరుద్ధరణకు సహకారం అందించాలని’ ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. కాగా, ఇప్పటికే ఎస్‌బీఐ తన ఉద్యోగులకు ఉచితంగా టీకా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దేశంలోని 60 శిక్షణా కేంద్రాలను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చింది. పీఎం కేర్ ఫండ్స్‌కు రూ. 108 కోట్ల విరాళాన్ని అందించింది. అలాగే, ప్రభుత్వానికి టీకా పంపిణీ కోసం అదనంగా రూ. 11 కోట్లు ఇచ్చింది.

Advertisement

Next Story