ఎంజీఎంలో టెస్టులు చేస్తలే.. కానీ, పాజిటివంట!

by Anukaran |
ఎంజీఎంలో టెస్టులు చేస్తలే.. కానీ, పాజిటివంట!
X

దిశ ప్రతినిధి, వరంగల్: అసలే వర్షాకాలం.. ఆపై కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో జలుబు, జ్వరం ఉన్న ప్రతి ఒక్కరికీ వైరస్ సోకిందన్న అనుమానం కలుగుతోంది. దీంతో టెస్ట్ చేయించుకోవాలని ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే చేదు అనుభవాలు ఎదరవుతున్నాయి. ఓ బ్యాంకు ఉద్యోగి అయితే నాలుగు రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా టెస్ట్ చేయలేదు సరికదా.. నెగెటివ్ వచ్చినట్లు మొబైల్ కు రిపోర్ట్ పంపించారు. దీంతో అతడు ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.

మొబైల్‌కు మెస్సేజ్..

కరోనా టెస్టుల్లో గందరగోళం నెలకొంది. అసలు టెస్టులు కూడా చేయకుండానే రిపోర్ట్స్ వస్తున్నాయి. ములుగుకు చెందిన మోహన్ ప్రసాద్ కరీంనగర్ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల కరోనా లక్షణాలతో బాధపడుతూ ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసేందుకు వెళ్లారు. అతడి వివరాలు నమోదు చేసుకున్న అక్కడి సిబ్బంది మరుసటి రోజు పరీక్షలకు రావాలని సూచించారు. అతడు నాలుగైదు రోజులు తిరిగినా పలు కారణాలు చెప్పి టెస్టులు చేయకుండానే పంపించారు. ఇంటికి వెళ్లి మొబైల్ చూసుకోగా కొవిడ్ నెగెటివ్ అని మెసేజ్ రావడంతో షాక్‌కు గురయ్యాడు. కరోనా టెస్టుల్లో గందరగోళం నెలకొందని సెల్ఫీ వీడియో తీశాడు. ప్రభుత్వం నిర్వహిస్తున్నకరోనా టెస్టుల్లో సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.

ఎంజీఎంలో గందరగోళం..!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎంజీఎంను పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలనే డిమాండ్లు ఎక్కువతుండగా ప్రస్తుతం ఆస్పత్రిలో కరోనా రోగులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఆస్పత్రిలో కరోనా మరణాలు ఆగడం లేదు. ఇటీవల పలువురు రోగుల బంధువులు కొవిడ్ వార్డులో సరైన సదుపాయాలు లేవని ఆందోళనకు దిగారు. ఏకంగా ఓ రోగి బంధువు అద్దాలు ధ్వంసం చేసి డాక్టర్‌పై దాడి చేసేందుకు యత్నించాడు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మరికొంత మంది సరైన ఆహారం పెట్టడం లేదని ఆందోళన నిర్వహించారు. మొత్తంగా ఎంజీఎంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఖాళీగా సూపరింటెండెంట్ పోస్ట్..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం 200 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు కరోనా రోగులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. 12 మంది డ్యూటీ డాక్టర్లు మెడికల్ కిట్లు లేవని, వసతులు కలిపించాలని ఆందోళనకు దిగుతున్నారు. సౌకర్యాల సంగతి పక్కన పెడితే ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామా చేసి వారం దాటినా ఇంకా ఆ పోస్ట్ భర్తీ కాలేదు. మంత్రి ఈటల రాజేందర్ జిల్లాకు వచ్చి ఎంజీఎం వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. సూపరింటెండెంట్ పోస్టును వెంటనే భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ల్యాబ్ టెక్నీషియన్ మృతి..

ఎంజీఎంలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఖుర్షీద్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బందికే అలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల గతి ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎంలో సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆర్‌ఎంవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా భయంతో చాలా మంది డాక్టర్లు, సిబ్బంది విధులకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed