శాతావాహన వర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీల పర్వం.. నిద్రమత్తులో నియంత్రణ విభాగం

by Shyam |
శాతావాహన వర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీల పర్వం.. నిద్రమత్తులో నియంత్రణ విభాగం
X

దిశ, కరీంనగర్ సిటీ : శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. విద్యా బోధనతో పాటు పరీక్షల నిర్వహణలో కూడా అధికారుల పట్టింపులేని తనం స్పష్టంగా గోచరిస్తున్నది. ఫలితంగా, ఏటా పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఉన్నత విద్యా మండలి మందలింపులు నిత్యకృత్యంగా మారాయి. అయినా, పరీక్షల నియంత్రణ విభాగం మాత్రం తీరు మార్చుకోవడం లేదు.

ప్రారంభం నుంచి ఏటా ఎక్కడో ఓ చోట ప్రశ్నపత్రాలు బహిర్గతమవుతున్నా, పరీక్షలు పటిష్టంగా నిర్వహించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. లీకైన విషయంపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. దీంతో, విశ్వవిద్యాలయ పరిధిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల వ్యవహార శైలి శ్రుతిమించుతుండగా, పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విశ్వవిద్యాలయం ప్రారంభించి పుష్కరకాలం గడిచినా, పరీక్షల నిర్వహణలో ఇంకా లోపాలు జరుగుతూనే ఉండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణంగా మొదటి బ్యాచ్ పూర్తి అయ్యే వరకే నిర్వహణ సమస్యలు ఉంటాయి. కానీ, ఎస్‌యూలో మాత్రం ఏయేటికాయేడు పెరిగిపోతున్నాయి. దీంతో, ఏదో ఒక పరీక్ష కేంద్రంలో లీకేజీలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారింది. ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన అధికారులు నిద్రమత్తును వీడకపోవటంతో, పేరుకే పరీక్షల నిర్వహణ అన్నట్లుగా జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

తాజాగా, బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటనలో కూడా అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వర్సిటీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రశ్న పత్రాలు రూపొందించి అవసరం మేరకు ముద్రిస్తూ, ఆయా కళాశాలలకు అందించాల్సిన బాధ్యత వర్సిటీలోని పరీక్షల నియంత్రణ విభాగానిది కాగా, గత విద్యాసంవత్సరం నుంచి కరోనా ప్రభావం మూలంగా అధికారులు ప్రశ్నాపత్రాలు మాత్రమే రూపొందిస్తున్నారు. వీటినే ఆన్‌లైన్‌లో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా పంపుతున్నారు.

ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు జిరాక్స్ తీసి, పరీక్షకు హాజరయ్యే వారికి అందించాల్సి ఉంటుంది. దీనిపై పరీక్షల నియంత్రణ విభాగం పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాల్సి ఉంటుంది. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగం ఉండటంతో, పలు కళాశాలలు ర్యాంకుల కోసం ప్రశ్నపత్రాలు బయటకు చేరవేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఉన్నత విద్య పురోగతిలో ఎస్‌యూ పాత్ర నామమాత్రంగానే ఉండగా, ఏటా జరుగుతున్న లీకేజీ తంతుతో నాణ్యమైన విద్యపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా విశ్వవిద్యాలయ యంత్రాంగం లీకేజీల వ్యవహారంపై సీరియస్‌గా స్పందిస్తే తప్ప, జిల్లా విద్యారంగంలో మార్పులు రావనే చర్చ విద్యాభిమానుల్లో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed