- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ లేఖలో ఏముంది? నర్సులకు దేశమంతా ఒకే డ్రెస్ కోడ్?
దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ పెట్టడంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ భావించింది. నర్సింగ్ కోర్సు చేస్తున్న విద్యార్థులందరికీ దేశమంతా ఒకే రకమైన యూనిఫారం ఖరారు చేయడంపై కూడా ఆలోచిస్తూ ఉంది. నర్సు వృత్తిలో ఉన్నవారందరికీ పేరు ముందు ‘ఎన్ ఆర్’ అనే రెండు అక్షరాలను ‘ప్రిఫిక్స్’గా చేర్చడంపై కూడా ఆలోచిస్తోంది. ఈ రెండు అంశాలపై అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవాల్సిందిగా భారత నర్సింగ్ కౌన్సిల్‌కు గతేడాది జనవరిలోనే లేఖ రాసింది. కానీ దీనిపై అప్పటి నుంచి పెద్దగా కదలిక లేదు. ఇప్పటికే ఏడాది కాలం పూర్తయిపోయినందున నర్సింగ్ కౌన్సిల్ మార్చి మూడవ వారంలో స్పందించింది.
అన్ని రాష్ట్రాల వైద్య విద్య డైరెక్టర్లకు నర్సింగ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ కేఎస్ భారతి మార్చి 23న లేఖలు రాశారు. ప్రస్తుతం డాక్టర్లకు పేరు ముందు ‘డీఆర్’ అని రాసినట్లుగానే నర్సులకు కూడా వారి పేరు ముందు ‘ఎన్ఆర్’ అనే అక్షరాలను రాయడంపై వీలైనంత తొందరగా అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్‌కు మార్చి 23న రాసిన లేఖ (నెం.1-2/2021/ఐఎన్‌సీ-1127)లో కోరారు. ఈ లేఖను తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్ కార్యాలయం పరిగణనలోకి తీసుకుని త్వరలో లిఖితపూర్వక అభిప్రాయాన్ని పంపడానికి సిద్ధమవుతోంది. ఎలాంటి ఆర్థిక అంశంతో సంబంధం లేని ఈ రెండు అంశాల్లో తెలంగాణ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోననే ఆసక్తి రాష్ట్రంలోని నర్సుల్లో నెలకొంది.
అత్యవసర సమయాల్లో వైద్యులను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేందుకు వీలుగా బస్సులు, రైళ్ళు, విమానాల్లో ప్రయాణించేవారిలో డాక్టర్లు ఉన్నట్లయితే వారి పేరు ముందు విధిగా ‘డీఆర్’ అనే అక్షరాలను పేర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వారి సేవలను వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇప్పుడు నర్సుల విషయంలోనూ అదే విధానాన్ని పాటించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ భావిస్తోంది. అందుకే భారత నర్సింగ్ కౌన్సిల్ ద్వారా అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలను క్రోడీకరించే బాధ్యతను అప్పజెప్పింది. ‘ఎన్ఆర్’ అనే అక్షరాలను చేర్చడం ద్వారా ఏ రాష్ట్రం ఎలా అభిప్రాయపడుతుందో తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
‘స్టాఫ్ నర్సు’లను ‘నర్సింగ్ ఆఫీసర్’గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో నర్సులను ‘నర్సింగ్ ఆఫీసర్’ అనే హోదాతోనే గుర్తిస్తున్నారు. ఆ తరహాలోనే వారిని సంబోధిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ తరహా గుర్తింపుపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు. అందుకే రాష్ట్రాల్లో నర్సుల హోదా పేరులో మార్పు రాలేదు. ఇప్పటికీ ‘స్టాఫ్ నర్సు’ అనే పిలుస్తున్నారు. ఇప్పుడు వారి పేరు ముందు ‘ఎన్ ఆర్’ అనే అక్షరాలను చేర్చే విషయంలో ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ నర్సింగ్ కౌన్సిల్ లేఖ నేపథ్యంలో తెలంగాణలోని నర్సుల సంఘాలన్నీ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నారు.