‘సాకి’.. సామ్ క్లాథింగ్ బ్రాండ్!

దిశ, వెబ్‌డెస్క్ : సమంత అక్కినేని మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే నటిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన అక్కినేని కోడలు.. ‘ఎకం స్కూల్’ ద్వారా విద్యా రంగంలోకి అడుగుపెట్టింది. కాగా, ఇప్పుడు సరికొత్తగా వస్త్ర వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ‘సాకి క్లాతింగ్ బ్రాండ్’ను పరిచయం చేస్తూ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది.

https://www.instagram.com/p/CEvqxAOhstY/?igshid=rdp80woi12i8

‘సాకి’ అనేది తన కల అని, తన బిడ్డ అని అభివర్ణించిన సామ్.. ఫ్యాషన్ పట్ల తనకున్న ప్రేమకు ‘సాకి’ ప్రతిబింబం అని తెలిపింది. యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి ముందే మాగజైన్స్, ఫ్యాషబుల్ స్టార్స్ తనను ఈ వైపుగా నడిపేందుకు ఆకర్షించాయని చెప్పింది. కానీ, ఆ సమయంలో డిజైనర్ దుస్తులు కొనగలిగే చాన్స్ లేదని.. నటిగా మారాకే ప్రతిభావంతులైన డిజైనర్స్ రూపొందించే దుస్తులను ధరించే గౌరవం దక్కిందని తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత నా సంతకంతో దుస్తులను ధరిస్తున్నానని చెప్పింది. ఇది ఒక భావోద్వేగమైన ప్రయాణమని.. మీరందరూ నాపై కురిపించిన ప్రేమ వల్లే ఇంత దూరం రాగలిగానని.. ఇదంతా సాధ్యమైందని తెలిపింది.

ఈ విషయాన్ని మీతో పంచుకోవడం మరింత ఆనందాన్ని ఇస్తుందని తెలిపిన సామ్.. సాకి ద్వారా స్నేహాన్ని పెంపొందించుకోవడం.. లైఫ్‌ను షేర్ చేసుకోవడం.. మీలో స్పెషల్ మోమెంట్స్ క్రియేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. త్వరలో ‘సాకి’ లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. దీనిపై స్పందించిన సెలెబ్రిటీలు, అభిమానులు సామ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాబోయే కాలంలో తన డ్రీమ్స్ అన్నీ కూడా అచీవ్ చేయాలని కోరుకున్నారు.

Advertisement