ఆ రైల్వేస్టేషన్‌లో రోబోలతో థర్మల్ స్క్రీనింగ్

by Shamantha N |
ఆ రైల్వేస్టేషన్‌లో రోబోలతో థర్మల్ స్క్రీనింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని సంక్షోభాలు కొత్త మార్పులకు నాంది పలుకుతాయి. కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ కండిషన్స్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. టెక్నాలజీ వినియోగం మునుపటితో పోలిస్తే ఇంకాస్త పెరిగింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు కంపెనీల ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్‌ను నిర్ధారించేందుకు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలు రోబోలు కొవిడ్ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు సాధారణ ప్రజానీకాన్ని, ప్రయాణికులను కాపాడేందుకు ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్.. రోబో, రోబోటిక్ డివైజెస్‌ను ఉపయోగిస్తోంది.

ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ కాగానే వారికి కొవిడ్ ఉందా? లేదా? తెలుసుకునేందుకు వీలుగా సెంట్రల్ రైల్వే ఆఫీసర్లు ‘ఫెబ్రి ఐ(Febri Eye)’, ‘కెప్టెన్ అర్జున్(Captain Arjun)’ అనే రోబోటిక్ డివైజెస్ ప్రవేశపెట్టారు. ఈ రెండు పరికరాలు ప్రయాణికుల బాడీ టెంపరేచర్‌ను తెలుపుతాయని, అందుకోసం వాటికి హీట్ సెన్సార్లు అమర్చబడ్డాయని తెలిపారు. ‘ఫెబ్రి ఐ’ డివైజ్‌కు అమర్చిన కెమెరా ద్వారా ఇది ప్యాసింజర్లను స్క్రీన్ చేస్తుంది. కెప్టెన్ అర్జున్‌కు ఆడియో-విజువల్ ఫెసిలిటీ కూడా ఉంది. దీంట్లో సెన్సార్ బేస్డ్ శానిటైజర్, మాస్క్ డిస్పెన్సర్ అమర్చారు. తద్వారా ఇది రైల్వే ప్లాట్‌ఫామ్ ఫ్లోరింగ్‌ను శానిటైజ్ చేయడంతో పాటు ప్రయాణికులకు మాస్కులను కూడా అందిస్తుంది.

Advertisement

Next Story