ఇక శ్రేయస్ అనుమానమే.. పంత్ వైపే మొగ్గు?

by Anukaran |
Sreyas Iyer
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గత సీజన్‌లో ఆ జట్టును ఫైనల్ వరకు చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతడి భుజానికి తగిలిన గాయం సాధారణమైనదే అని తొలుత భావించారు. కాగా, వైద్య పరీక్షల్లో భుజానికి తగిన గాయం చాలా తీవ్రమైనది అని తేలింది. అతడికి తప్పక శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉన్నట్లు వైద్యులు చెప్పారు. శ్రేయస్ అయ్యర్‌కు శస్త్ర చికిత్స చేసిన అనంతరం కనీసం 4 వారాల పాటు విశ్రాంతి అవసరం అని.. ఆ తర్వాతే అతడు మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం టీమ్ ఇండియా బయోబబుల్ వీడి వెళ్లిపోయిన అయ్యర్.. ఇప్పట్లో క్రికెట్ ఆడే పరిస్థితి లేనట్లు సమాచారం. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో కెప్టెన్ కోసం వేట ప్రారంభించింది.

Sreyas Iyer, Pant

కెప్టెన్లు చాలా మంది..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఇప్పటికే కెప్టెన్లుగా వ్యవహరించిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన స్మిత్.. పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆ ఫ్రాంచైజీ జట్టు నుంచి విడుదల చేసింది. కనీస ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్‌ను కొనుక్కున్నది. ఇలాంటి పరిస్థితుల్లో స్మిత్‌ను ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తారో లేదో చూడాలి. ఇక అజింక్య రహానే టీమ్ ఇండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియాలో ఇండియా జట్టును గెలిపించాడు. అయితే టీ20లో కెప్టెన్‌గా ఆకట్టుకునే రికార్డు లేదు. ఇక రవిచంద్రన్ అశ్విన్ గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించాడు. వీళ్లతో పాటు శిఖర్ ధావన్ పేరు కూడా కెప్టెన్ల రేసులో వినపడుతున్నది. అయితే వీరందరిలో పంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.

అందరూ ఒప్పుకుంటేనే..

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ల రేసులో రిషబ్ పంత్ ముందున్నాడు. ఢిల్లీ రంజీ జట్టుకు విజయ్ హజారే ట్రోఫీ 2017లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉన్నది. గత ఐపీఎల్ నుంచి అన్ని ఫార్మాట్లలో చెలరేగి ఆడుతున్నాడు. ప్రస్తుతం పంత్ శారీరికంగా, మానసికంగా ధృఢంగా ఉండటంతో అతడివైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రమోటర్లు, కోచ్ రికీ పాంటింగ్ నిర్ణయమే కీలకం కానున్నది. పంత్ కెప్టెన్సీకి రికీ పాంటింగ్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే అనుభవం దృష్ట్యా ప్రమోటర్లు వేరే పేర్లు సూచించవచ్చని తెలుస్తున్నది. పంత్ కాకపోతే స్మిత్ వైపు మొగ్గు చూపొచ్చని తెలుస్తున్నది. ఐపీఎల్‌కు మరో రెండు వారాలే సమయం ఉండటంతో త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌పై నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed