రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు

by Shyam |   ( Updated:2021-02-05 01:53:57.0  )
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు
X

దిశ, ఫీచర్స్: రోజువారీ దినచర్యలో భాగంగా ప్రతిఒక్కరూ ఎవరి పనిలో వారు బిజీగా వెళ్తుంటారు. అనుకోకుండా వారి కళ్లెదుట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే క్షతగాత్రులను రక్షించడానికి, ఆస్పత్రికి చేర్చేందుకు సిద్ధమైతారు. కానీ, మనలో చాలామంది సాయం చేసేందుకు వెనుకాడుతుంటారు. ఎందుకంటే సమయం వృథా అవుతుందని.. ముఖ్యంగా పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడతారు. ఈ తలనొప్పులన్నీ మనకెందుకులే అని వదిలేస్తుంటారు. దీంతో క్షతగాత్రులకు గోల్డెన్ అవర్ ట్రీట్‌మెంట్ (ప్రమాదం జరిగిన గంటలో ఆస్పత్రిలో ఇచ్చే కీలక వైద్యం) అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రసర్కారు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘గుడ్ సమరిటన్ పాలసీ (Good Samaritan Policy)’ ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను వెంటనే ఆస్పత్రికి చేర్చినవారికి నగదు రివార్డు అందజేయనుంది.

యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా క్షతగాత్రులకు సాయం చేసిన వ్యక్తి పేరు ఎక్కడా బయటపెట్టొద్దని సర్కారు పేర్కొంది. వారు పోలీస్ స్టేషన్ నుంచి విచారణ కోసం రావాల్సి ఉంటుందని, అయితే దీర్ఘకాలం పాటు వారిని విచారించొద్దని తెలపడంతో పాటు వారు పీఎస్‌కు వచ్చినందుకు నగదు అవార్డు ఇచ్చేలా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదాన్ని చూసిన వారు మాత్రం కోర్టులో సాక్షిగా జరిగిన ఘటన గురించి చెప్పాల్సి ఉంటుంది. కాగా, ప్రమాద బాధితులను ఆస్పత్రికి చేర్చిన వ్యక్తి ఒక్కరే అయితే అతనికి రూ.2,000 ఇవ్వనున్నారు. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు హెల్ప్ చేస్తే చెరో రూ.2 వేలు, ఇద్దరి కంటే ఎక్కువ మంది సాయం చేస్తే వారందరికీ కలిపి రూ.5 వేల నగదు రివార్డు ఇవ్వనున్నారు. గతేడాది జార్ఖండ్ రాష్ట్రంలో3,366 రోడ్డు ప్రమాదాలు సంభివించాయని, ఇందులో 2,294 మరణాలు నమోదైనట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. మరణాల రేటు తగ్గించి, క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించేందుకు జార్ఖండ్ రాష్ట్ర సర్కారు ఈ నూతన పాలసీని తీసుకొచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed