రేవంత్ దీక్ష ఎఫెక్ట్.. కేసీఆర్ దత్తత గ్రామాల్లో పనులు వేగవంతం

by Shyam |
Revanth Reddy Deeksha
X

దిశ, జవహర్ నగర్: గత రెండ్రోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో ‘దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష’ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఓవైపు దీక్షా స్థలి మొత్తం టీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లుతుండడంతో మరోవైపు కేసీఆర్ దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని రేవంత్ రెడ్డి మండిపడుతున్నాడు. దీంతో మేడ్చల్-మల్కాజిరిగి కలెక్టర్ హరీష్ బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ దత్తత గ్రామాలైన మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవాపురం గ్రామాల్లో అభివృద్ధి పనులు వెంటనే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, దీక్షలో రేవంత్ మాటలకు హుటాహుటిన కలెక్టర్ స్పందించడం దుమారం రేపుతోంది. దత్తత గ్రామాలు ఏనాడూ గుర్తుకు రానిది రేవంత్ దీక్షతో సమీక్షలు చేయడంతో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని నేటి కలెక్టర్ సమీక్ష నిరూపించిందని కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది. రేవంత్ దీక్ష ప్రారంభం కాగానే అభివృద్ధిపై విమర్శలు తలెత్తడంతో అధికారులు చర్యలు చేపట్టేందుకు పునుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని దత్తత గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ విషయంలో గ్రామంలో అన్ని రకాల పనులను వేగవంతం చేసి, పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటివరకు పనులు ఎంతవరకు జరిగాయని, ఇకపై పెండింగ్ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని, ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. దత్తత గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే, ఏమాత్రం నిధుల కొరతలేదని, ఏమైనా ప్రత్యేక నిధులు అవసరం ఉన్నా ఇచ్చేందుకు అవకాశం ఉందని, అవసరమైన పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ మోహన్ రావు, ఆర్అండ్‌బీ ఈఈ, పంచాయతీరాజ్ ఈఈ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed